Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడల అభివృద్ది పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి
- గ్రామీణ క్రీడాకారులకు గొప్ప మద్దతు
- బడ్జెట్లో క్రీడలకు సముచిత కేటాయింపులు
- శాట్స్ చైర్మెన్ ఈడిగ ఆంజనేయ గౌడ్
అంతర్జాతీయ క్రీడా యవనికపై ఇటీవల తెలంగాణ క్రీడాకారులు గొప్ప ఫలితాలు రాబడుతున్నారు. మనోళ్లు దేశం గర్వపడే ప్రదర్శనలు కనబరుస్తున్నారు. బాక్సింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, స్విమ్మింగ్, కబడ్డీ సహా పలు క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. తెలంగాణ క్రీడాకారుల అద్వితీయ ప్రదర్శన, క్షేత్రస్థాయిలో క్రీడాభివృద్ధితో భారత క్రీడారంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని శాట్స్ చైర్మెన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఇటీవల తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్న ఆంజనేయగౌడ్తో తెలంగాణలో క్రీడల అభివృద్ది, బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు, తెలంగాణలో కోచింగ్ వ్యవస్థ సహా పలు అంశాలపై 'నవతెలంగాణ క్రీడాప్రతినిధి' ముచ్చటించారు. శాట్స్ చైర్మెన్‌తో ముఖాముఖి విశేషాలు..
నవతెలంగాణ-హైదరాబాద్
- రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయింపుల పట్ల మీ స్పందన?
సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్ద పీట వేశారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే రూ. 53.79 కోట్లు అధికంగా నిధులు కేటాయించారు. 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన దేశంలో ఖేలో ఇండియా క్రీడలకు రూ.1000 కోట్లు కేటాయించారు. అది ఖేలో ఇండియా కాదు, కూల్చే ఇండియా. మూడు క్రీడా పాఠశాలలకు రూ.23.83 కోట్లు, స్టేడియాల ఆధునీకరణకు రూ.30 కోట్లు నిధులు కేటాయింపులు చేశారు. తెలంగాణలో క్రీడా స్వర్ణయుగం తీసుకురావడానికి బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలకు రూ.5-6 కోట్లు అధికంగా కేటాయించేందుకు ఆపసోపాలు పడేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి రూ.53.79 కోట్లు అధికంగా నిధులు ఇచ్చారు. క్రీడారంగం అభివృద్ది పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
- గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రణాళికలు?
క్షేత్రస్థాయి నుంచే క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయం. అందుకోసమే గ్రామీణ క్రీడాప్రాంగణాలను అసమాన రీతిలో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన 12140కిపై గ్రామీణ క్రీడా ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ఓవరాల్‌గా 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, గ్రామీణ క్రీడాకారులకు ఆట స్థలాలను అందించే బృహత్తర లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్లో రూ.45 కోట్లు నిధులు కేటాయించారు. గతంలో గ్రామాల్లో క్రీడలకు అనువైన ప్రదేశం ఉండేది కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సాధారణ విషయం కాదు. ప్రభుత్వానికి గొప్ప సంకల్పం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి ఓ స్టేడియం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని క్రీడలకు ఈ స్టేడియాలు కేంద్రాలుగా నిలుస్తాయి. గ్రామీణ క్రీడాకారులకు ఇవి ఎంతో దన్నుగా నిలుస్తాయి. భవిష్యత్‌లో గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేం దుకు ఇది పునాదిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
- రాష్ట్రంలో కోచింగ్ వ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలు?
రాష్ట్రంలో కోచ్‌ల కొరత కొంత వరకు వాస్తవమే. అవసరమైన సందర్భాల్లో నిపుణులైన కోచ్‌లను శాట్స్ ఎప్పటికప్పుడు నియమిస్తూనే ఉంది. జిల్లా స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్, పీఈటీల సేవలను సైతం సద్వినియోగం చేసుకుంటున్నాం. కోచ్‌ల అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మంత్రుల ఉపసంఘం కోచ్‌లు, క్రీడా విధానంపై సమగ్రమైన నివేదిక ఇవ్వనుంది. ఉపసంఘం నివేదికతో కోచ్‌లతో పాటు ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం లభించనుంది. తెలంగాణ క్రీడా రంగానికి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఉంటుంది.
- క్రీడాకారులకు ప్రోత్సాహకాలపై ప్రభుత్వ విధానం?
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను గొప్పగా గౌరవిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ నగదు ప్రోత్సాహకాలు, గ్రూప్-1 ఉద్యోగాలు సహా హైదరాబాద్‌లో విలువైన ఇండ్ల స్థలాలు కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఈ ఏడాది సైతం క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాల నిమిత్తం బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం సహాయం అందని క్రీడాకారులు ఎవరైనా ఉంటే కచ్చితంగా శాట్స్ బాధ్యత తీసుకుని భవిష్యత్‌లో ప్రోత్సాహకాలు తప్పకుండా అందేలా చేస్తుంది.
- హైదరాబాద్‌లో స్టేడియాల పట్ల నిర్లక్ష్యంపై ఏమంటారు?
తెలంగాణలో నగరాల విస్తరణకు ముందు క్రీడా వ్యవస్థ హైదరాబాద్‌లో కేంద్రీకృతమైంది. ఇప్పుడు నగరాల విస్తరణ తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాలకు వ్యాపించింది. నగరం శివారు ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లో నూతన స్టేడియాలు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఎల్బీ స్టేడియం నుంచి ఉప్పల్ స్టేడియానికి తరలిపోయాయి. ఇతర క్రీడల్లో రాష్ట్ర స్థాయి పోటీలు సైతం ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలతో నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియం ఇప్పటికీ మెరుగైన సౌకర్యాలతో ఉంది. చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే కచ్చితంగా సరిచేస్తాం. క్రీడాకారులకు అనువైన రీతిలో ఎల్బీ స్డేడియాన్ని తీర్చిదిద్దుతాం.
- శాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోటీలు నిర్వహిస్తారా?
దేశంలో క్రీడలకు రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా రాష్ట్ర క్రీడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరలోనే అన్ని క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. శాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలు సైతం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే దీనిపై సమగ్ర విధానం తీసుకొస్తాం.
- గ్రామీణ క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏం చేస్తారు?
క్రీడలు ఆరోగ్య సమాజానికి పునాది. గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలిపేందుకు తెలంగాణ రాష్ట్రం కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం శాట్స్ యంత్రాంగం పని చేస్తుంది. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు అమలవుతుంది. గ్రామీణ క్రీడాకారుల్లో స్ఫూర్తి రగిల్చిందుకు ప్రపంచ విజేతలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 'మీట్ ది చాంపియన్' కార్యక్రమం నిర్వహించనున్నాం. భవిష్యత్‌లో గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నాం.