Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటిజాగా ఉన్నవారికి రూ.3.5 లక్షల నిధుల కేటాయింపేది?: వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం పనుల విస్తరణ కోసం కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం..తన బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం, కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పేర్కొంది. మంగళవారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి స్థలమున్నవారికి రూ.3.5 లక్షల సహాయం అందజేస్తామన్న ప్రభుత్వం దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బ్యాంకులిచ్చే అప్పులపైన ఆధారపడి కడతామని చెప్పడం ఆందోళనకరమని తెలిపారు. ఆసరా పింఛన్ల వయస్సు 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య పది లక్షలకు పెరిగిందని చెబుతున్న సర్కారు దానికి అదనంగా ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం మోసం చేయడమేనని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతంపై దృష్టిసారించకపోవడం అన్యాయమని తెలిపారు.