Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ విజరుసేన్‌రెడ్డి మంగళవారం విచారించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైందా? అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి ఐదు దఫాలు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లాక హైకోర్టు తీర్పుపై స్టే వస్తే సీబీఐ ఫైళ్లను సిట్‌కు వెనక్కి ఇచ్చేస్తుందని చెప్పారు. రాజేందర్‌నగర్ ఏసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్ తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ, సీబీఐ కేసు నమోదు చేయాలనీ, కేసు ఫైళ్లు అప్పగిం చాలని ఒత్తిడి చేస్తోందన్నారు. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో మెరిట్స్ జోలికి వెళ్లలేదు కాబట్టి సింగిల్ జడ్జి స్టే ఇవ్వొచ్చునని చెప్పా రు. ఈ కేసులో సీబీఐ అత్యుత్సాహంగా ఉందన్నారు. సిట్ అనేక కీలక ఆధారాల్ని సేకరిం చిందనీ, సీబీఐ దర్యాప్తు మొదలైతే అవన్నీ ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నిందితుల తరఫు లాయర్లు వాదిస్తూ, ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత దానిపై అప్పీల్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని, లేదా ఆ తీర్పును సమీక్ష చేయాలంటే అదే ద్విసభ్య ధర్మాసనం వద్దకు వెళ్లాలన్నారు. సింగిల్ జడ్జి వద్దకు రాకూడదన్నారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. వాదనల తర్వాత జస్టిస్ విజయసేన్‌రెడ్డి స్పందిస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. కనీసం వారం రోజులు స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారించొచ్చో లేదోననే విషయంపై చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి అనుమతి తీసుకొని రావాలని అడ్వకేట్ జనరల్‌ను జడ్జి ఆదేశించారు. బుధవారం ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్ చేస్తామని ఏజీ తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
అసెంబ్లీ ఫండ్స్‌పై రిట్
తన నియోకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ మాధవీదేవి విచారించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) ఇచ్చే అంశం అసెంబ్లీ పరిధిలో లేదనీ, దీనిపై హైకోర్టు విచారణ చేయరాదని ప్రభుత్వం చెప్పింది. పిటిషన్ విచారణ అర్హతపై ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేస్తామని జడ్జి ప్రకటించారు.
నైటింగేల్ నర్సింగ్ స్కూల్లో అడ్మిషన్లకు అనుమతి
హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ లోని నైటింగేల్ నర్సింగ్ స్కూల్ల్లో 2022-23 ఏడాదికి మూడేండ్ల జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ కోర్సుల అడ్మిషన్లను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.నంద ఆదేశించారు. కాలేజీ పర్మిషన్లు రద్దు చేయకుండా ఆడ్మిషన్లు ఆపడానికి వీల్లేదన్నారు.