Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్స్ డే విజయవంతం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిమాండ్స్ బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కే యాదయ్య ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు భారీగా స్పందించారు. ఆర్టీసీ మనుగడనే ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో డిమాండ్ బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేసినట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని తప్పుపట్టారు.
నిధులు లేక ఆర్టీసీ విస్తరణ జరగట్లేదనీ, ఇప్పటికే సగానికి పైగా బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన రాయితీలు గతేడాది రూ.927 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఆ సొమ్ము రూ.1,200 కోట్లకు పెరిగిందనీ, ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదని తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన రెండు వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం 45వేల ఆర్టీసీ కుటుంబాల గురించి ఆలోచించకపోవడం సరైంది కాదని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ స్థితిగతులపై కూలంకషంగా చర్చించి, తక్షణం 2 శాతం నిధుల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.