Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్వ జిల్లా సర్వీసు పరిగణనలోకి
- 12 నుంచి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీకి దరఖాస్తు చేయాలంటే ఒక పాఠశాలలో రెండేండ్ల కనీస సర్వీసు ఉన్న ఉపాధ్యాయులే అర్హులని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిబంధనను ప్రభుత్వం సడలించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా 317 జీవో ద్వారా వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటిం చింది. ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమివ్వను న్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం మంత్రి కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 317 జీవో కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన 59 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సవరణ షెడ్యూల్‌ను శ్రీదేవసేన విడుదల చేశారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి : ఎస్టీయూటీఎస్
317 జీవో బాధిత ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లను ఇస్తూ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యామంత్రి, అధికారులను ఈ అంశంపై విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయగమని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అందరికీ బదిలీ అవకాశం కల్పించాలి : పీఆర్టీయూ తెలంగాణ
హైకోర్టు ఆదేశం ప్రకారం 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ సీనియార్టీని లెక్కిస్తూ కోర్టుకు పోయిన వారికే కాకుండా అందరికీ బదిలీ అవకాశం కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, ఎం అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీరో సర్వీసు కల్పించి 317 ఉపాధ్యాయులకు పాత స్టేషన్ సీనియార్టీ లెక్కించే విధంగా నిబంధనలు రూపొందించాలని గతంలో ప్రాతినిధ్యం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బదిలీలు, పదోన్నతులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.