Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపల్యాలతోనే ప్రజల సమస్యలు అధికం
- టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- ములుగు
కేంద్రంలో, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన జోడో యాత్రకు సూచికగా రాష్ట్రంలో ప్రారంభించిన 'హాత్ సే హత్' అభియాన్ యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అధ్యక్షతన జరిగిన కార్నల్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ నిర్బంధ విద్య, ఇంటికో ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పంట రుణమాఫీ.. లాంటి హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, ప్రజలు కృషిచేయాలని కోరారు. 2004లో ఏ రకంగా సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చి అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లామో, అదే విధంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే.. రాష్ట్రాన్ని ఒక సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీఇచ్చారు. పంటకు మద్దతు లేక రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందని, ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని, మహిళలకు రక్షణ లేదని, గిరిజనులు, ఆదివాసీలకు సముచితమైన స్థానం లేదని, మాదిగలను గుర్తించింది లేదనీ, ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం లేదని విమర్శించారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మారుస్తామని, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మల్లంపల్లి మండలంగా మార్చి జీవో ఇస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ అనుగ్రహంతో ఈ పాదయాత్ర 60 నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెళ్ళ కుమారస్వామిని రేవంత్ రెడ్డి పరామర్శించారు. మున్నూరు కాపులు రేవంత్ రెడ్డికి నాగలి బహుకరించి శాలువాతో సత్కరించారు. పాదయాత్రలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ కేంద్రమంత్రి పొరిక బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కూచిన రవళి రెడ్డి, పైడాకుల అశోక్, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, ఎండీ చాంద్ పా, ఆకుతోట చంద్రమౌళి, చింతలపూడి బిక్షపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.