Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏవీఎస్ రాష్ట్ర మహాసభలో 22అంశాలపై తీర్మానాలు
- రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పూసం సచిన్, ఆత్రం తనూష్
నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్) డిమాండ్ చేసింది. రెండ్రోజులపాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర రెండో మహాసభ విజయవంతంగా ముగిసింది. వివిధ అంశాలపై మహాసభలో 22 తీర్మానాలను ఆమోదించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో మంగళవారం మహాసభ తీర్మానాలు, రాష్ట్ర నూతన కమిటీని వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీతోపాటు విద్యారంగ సమస్యలు, సంస్కృతి పరిరక్షణ, ఆదివాసీ చట్టాల అమలు, మెరుగైన వైద్య సేవలు, గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలు కోసం భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై తీర్మానాలు చేసినట్టు నాయకులు వివరించారు.
టీఏవీఎస్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పూసం సచిన్, ప్రధాన కార్యదర్శిగా ఆత్రం తనూష్ (హైదరాబాద్ ఓయూ), ఉపాధ్యక్షులుగా మెస్రం రాజు (తెలుగు యూనివర్సిటీ), కోరెంగ మాలశ్రీ(ఆసిఫాబాద్), బైరి సోమేశ్(ఆదిలాబాద్), ఆడ అర్జున్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా తుంరం ఈశ్వర్, కొట్నాక్ పుష్పలత, కుంరం దీపక్, కమిటీ సభ్యులుగా మెస్రం సుమిత్ర, ఆత్రం వనిత(నిర్మల్), భీమిని ఆనంద్, సూదుల శ్రవణ్(భూపాలపల్లి), మడకం సురేష్, దిగిడే ప్రకాష్, మాడపాటి కిరణ్ (ఆసిఫాబాద్), ఉయిక విష్ణు, నల్లి రాజ్‌కుమార్(మంచిర్యాల), జుగ్నాక సంతోష్ తదితర 21 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.