Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చినాటికి కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలకు 400 జింకలు
- ఇప్పటికే జూపార్కుల నుంచి 58 శాకాహార జంతువుల తరలింపు
- జీవవైవిధ్యం పెంపునకు ఆటవీశాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అడవుల్లో జీవవైవిధ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు శాకాహార జంతువులను తరలించే అంశంపై అటవీశాఖ కసరత్తు చేస్తున్నది. మార్చి నాటికి రాష్ట్రంలోని జూపార్కుల నుంచి కనీసం 400 జింకలను కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఇటీవల వరంగల్ కాకతీయ జూ పార్క్ నుంచి 20 చుక్కల దుప్పిలు, 13 సాంబార్ జింకలు (ఖనుజు), 6 నెమళ్లను ఏటూరు నాగారం అభయారణ్యానికి, నెహ్రూ జూ పార్కు నుంచి 19 చుక్కల దుప్పిలను అమ్రాబాద్ పులుల టైగర్ రిజర్వుకు తరలించారు. రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఆహార కొరతతో వన్యప్రాణుల సంపద క్రమంగా తగ్గుతున్నది. దీంతో అడవుల్లో జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అటవీ శాఖ అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు చర్యలకు పూనుకున్నది. జూ పార్కుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాకాహార జంతువులను అటవీ తరలింపునకు పూనుకున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్లలోనిజూ పార్కులు, షామీర్పేట, కిన్నెరసాని, హయత్‌నగర్, కరీంనగర్‌లలో జింకల పార్కులున్నాయి. వాటిల్లో పెద్దసంఖ్యలో జింకల సంతతి పెరుగుతున్నది. ఇలా పెరిగిన జంతువులను అటవీ ప్రాంతాలకు తరలించటం ద్వారా మాంసాహార జంతువులకు అవసరమైన వేట జంతువుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. మార్చి కల్లా దాదాపు 400 జింకలను (చుక్కల దుప్పి, ఖనుజు, కృష్ణ జింక, మనబోతు) నెహ్రూ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నుంచి రాష్ట్రంలో ఉన్న పులుల ఆవాసాలకు తరలించనున్నారు. జంతువులను తరలించే క్రమంలో అడవుల్లోని జంతువులకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలను అటవీ శాఖ తీసుకోనున్నది. అందులో భాగంగా ఆయా జంతువులకు టీకాలను వేయనున్నారు.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు-1972కు లోబడే తరలింపు
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.ఎం. డోబ్రియాల్
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు-1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ అభయారణ్యాలకు శాకాహార జంతువులను తరలించబోతున్నాం. కవ్వాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరు నాగారం, పాకాల అభయారణ్యాల్లోనూ జంతు సమతుల్యత పెంపునకు ఈ తరలింపు దోహదపడుతుంది. జంతువులను తరలించే ముందు వాటికి ఆరోగ్య పరీక్షలు చేస్తాం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. అడవుల్లో శాకాహార జంతువులను వదిలే చోట్లను మా శాఖ జాగ్రత్తగా ఎంపికచేస్తోంది. అవసరమైన గడ్డి మైదానాలు, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.