Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు
- 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం
- 20న ఈసెట్
- 26,27 తేదీల్లో ఐసెట్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
- ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి మంత్రి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ రాతపరీక్షలు ఆన్లైన్లో మే ఏడు నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు అదేనెల ఏడు నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తామని వివరించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం విద్యార్థులకు మే 12 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలుంటాయని పేర్కొన్నారు. అదేనెల 18న ఎడ్‌సెట్, 20న ఈసెట్ రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. మే 25న లాసెట్, 26,27 తేదీల్లో ఐసెట్, 29 నుంచి 31 వరకు పీజీఈసెట్ పరీక్షలుంటాయని వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు.