Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎరకు సంబంధించిన కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన తీర్పును యథాతథంగా ఉంచాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసే వరకు హైకోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారణకు అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డివిజన్ బెంచ్‌ను కోరితే అందుకు నిరాకరిస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమ తీర్పుపై అప్పీల్ సుప్రీంకోర్టులోనే చేసుకోవాలని, హైకోర్టులో కాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ను రాష్ట్ర సర్కార్ వాపస్ తీసుకుంది. తొలుత ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రస్తావించామనీ, ఆ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసే వరకు సింగిల్ జడ్జి యథాతథస్థితిగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అంశంపై విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం, ఒకసారి సింగిల్ జడ్జి తీర్పు చెప్పిన తర్వాత దానిపై అప్పీల్ కూడా దాఖలైనప్పుడు మళ్లీ ఆ అంశాన్ని సింగిల్ జడ్జి విచారించే ఆస్కారమే లేదని చెప్పింది.