Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10.66 కోట్ల పనిదినాలు పూర్తి
- 12 కోట్ల పనిదినాలకు ప్రతిపాదనలు పంపాం
- షరతులతో 11 కోట్ల పనిదినాలకు కేంద్రం అంగీకారం
- ఉపాధి హామీ చట్టం ఎనిమిదో కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టం అమలు విషయంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గతేడాది 10.66 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలు కేటాయించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే, అనేక షరతులు పెట్టి కేవలం 11 కోట్ల పనిదినాలకే కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు. బుధవారం శాసనసభ సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎనిమిదో కౌన్సిల్ సమావేశం ఎర్రబెల్లి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని మన రాష్ట్రం అత్యధికంగా ఉపయోగించుకుంటున్నదనే అక్కసు కేంద్రానికి ఉందన్నారు. అందుకే అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కూలీలకిచ్చే గడ్డపారలు, గంపలు, పారలు, మెడికల్ కిట్లు ఇవ్వాలని అడిగితే కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో గొర్లు కాసేవారికి షెడ్లు వేసుకునేందుకు ప్రభుత్వమే స్థలాలు చూపే విధంగా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పీటీజీలకు కనీసం 150 రోజుల పనికల్పించే విధంగా కేంద్రాన్ని కోరాలన్నారు. రైతు కల్లాలు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు అడ్డుపడటాన్ని తప్పుబట్టారు. కల్లాల కోసం రూ.150 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టామన్నారు. ఈ పేరుతో రాష్ట్రానికి రావాల్సిన రూ.800 కోట్లను పదినెలలుగా కేంద్రం ఆపిందని విమర్శించారు. ఆ డబ్బులు మినహాయించుకుని మిగిలిన నిధులను విడుదల చేయాలంటూ ఒత్తిడి చేస్తే రూ. 276 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో 'ఉపాధి' ద్వారా 61 శాతం మంది మహిళలు పనిదినాలు పొందుతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.3135.7 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. గతం నుంచి కొనసాగుతున్న రాగా సాఫ్ట్‌వేర్‌ను మార్చి నరేగ సాఫ్ట్వేరు తెచ్చారనీ, దీనివల్ల ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేసే బృందాల వద్దకెళ్లి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి కేంద్రానికి పంపాల్సి వస్తున్నదని తెలిపారు. పనికి ముందు, పని జరిగేటప్పుడు, పని జరిగిన తర్వాత ఫొటోలు తీయాలన్న నిబంధన సరిగాదని తెలిపారు.