Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
- ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను పోలిమేరలు దాటించండి
- మెడికల్ కళాశాల పేరుతో భూములు ఆక్రమణ
- టీపీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-మహాబూబాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు అవస్థలు పడ్డారని, పాపాల భైరవుడు కేసీఆర్‌ను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడితేనే తెలంగాణకు రక్ష అని టీపీసీసీ అధ్యక్షులు అనుమల రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన 'హాత్ సే హాత్' జోడో యాత్ర మూడవ రోజు బుధవారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఉదయం కేసముద్రం మండలం పెనుగొండలో ప్రారంభమైన పాదయాత్ర మహబూబాబాద్ మండలం ఈదుల పూసపెల్లి వరకు కొనసాగింది. మానుకోట అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌తో కలిసి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నిజామ్ నవాబ్‌లా మారాడని, టీఆర్ఎస్ నాయకులు రజాకార్లులా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసీఆర్‌కు సామంత రాజుగా ఉన్నారని విమర్శించారు. మానుకోటలో అపారమైన ఖనిజ సంపద ఉందని, ఉక్కు పరిశ్రమ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మానుకోటలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి గెలిపించాలని కోరారు. యాత్రలో.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ నేత రోహిత్ చౌదరి, పార్లమెంట్ ఇన్చార్జ్ విజరు రమణారావు, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, నాయకులు సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.