Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగులు భూమి పేదలకు పంచాలి
- దేశవ్యాప్త పోరాటాలకు రూపకల్పన
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-అడిక్మెట్
దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికుల జీవన భద్రత కోసం పార్లమెంట్లో సమగ్ర శాసన చట్టాన్ని తీసుకురావాలని, సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ పోడుహక్కు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మిగులు భూములను పేదలకు పంచాలని దేశవ్యాప్త పోరాటాలకు రూపకల్పన చేయనున్నామన్నారు. బెంగాల్ రాష్ట్రం హౌరాలో జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ పోస్టర్ను బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17వ తేదీన జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువన్నారు. వ్యవసాయరంగ ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వ్యవసాయ కార్మికులుగా ఉన్న దళితులు, గిరిజనులు, వృత్తిదారులు ఎలాంటి సామాజిక భద్రతా లేకుండా అభద్రతాభావంలో బతుకుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నివాసం, జీవన భృతి కల్పించే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధంగా పార్లమెంటులో సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పోడు భూముల్లో సాగులో ఉన్న ఆదివాసీ గిరిజనులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కుటుంబానికి పదెకరాలు, మూడు తరాలుగా సాగులో ఉన్న గిరిజనేతర పేదలకు భూమిపై హక్కు పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూ సీలింగ్ చట్టం ప్రకారం భూస్వాములు, పెత్తందారుల చేతిలో ఉన్న మిగులు భూములను బయటికి తీసి పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పోరాటాలకు రూపకల్పన ఈ మహాసభలో చేస్తామని చెప్పారు. 17వ తేదీన జరగనున్న బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, అధ్యక్షులు విజయ రాఘవన్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, సీనియర్ నాయకులు పి.సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, మచ్చ వెంకటేశ్వర్లు, కొండమడుగు నరసింహ, పొన్నం వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రంగన్న తదితరులు పాల్గొన్నారు.