Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశించిన అభివృద్ధిని సాధించకపోవడానికి ఇదే కారణం : అక్బరుద్దీన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్నదని శాసనసభలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై ఆయన చర్చను ప్రారంభిస్తూ...కేంద్రం తెలంగాణకు రావాల్సిన నిధుల్లో వాటాను తగ్గించిందని విమర్శించారు. తద్వారా రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. అయితే వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం విషయంలో కేంద్రం ఉదారంగా సాయం చేసి ఉంటే, మరిన్ని విజయాలు సాధించి ఉండేదన్నారు.
అయినా తెలంగాణ రాష్ట్రం స్వయం కృషితో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నదని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ. 7,496 కోట్లు, ఏపీకి రూ. 33,376 కోట్లు, 2022-23లో తెలంగాణకు రూ.19,668 కోట్లు, ఏపీకి రూ.38,177 కోట్లు అందాయనీ, 2023-24లో తెలంగాణకు రూ.21,471 కోట్లు, ఏపీకి రూ.41,338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టు తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏపీ-తెలంగాణ వాటాల నిష్పత్తి 58:42గా ఉండాలనీ, ఈ విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈయేడాది రుణ పరిమితిని కేంద్రం రూ.19,000 కోట్లు తగ్గించిందన్నారు. 2022-23లో రూ. 53,970 కోట్లను ప్రతిపాదించగా రూ.34,970 కోట్లు మాత్రమే రుణం తీసుకోవాలని రాష్ట్రంపై ఒత్తిడి పెంచిందన్నారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 100 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకున్న కేంద్రం...తెలంగాణ తీసుకుంటే తప్పుపడుతున్నదన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం తీసుకుంటున్న అప్పులకు ప్రతిరోజుకు రూ.2958.82 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘానికి వాస్తవ అంచనాలను పంపాలంటూ కోరారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. ఆ పథకానికి సంబంధించి దాదాపు 35,494 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనీ, ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేస్తే క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులు ప్రయోజనం పొందేలా రాష్ట్రం కూడా ఇదే పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.