Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే పోడు భూములకు పట్టాలంటున్న ప్రభుత్వవర్గాలు
- కలెక్టర్లతో మంత్రులు, సీఎస్ వరుస వీడియో కాన్ఫరెన్స్‌లు
- పూర్తికాని ఏర్పాట్లు
- లబ్దిదారుల సంఖ్యపై అనుమానాలు
- కటాఫ్ తేదీ పొడిగించేందుకు అంగీకరించని కేంద్రం
ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న పోడు భూముల అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుందా?. అవుననే అంటున్నాయి ప్రభుత్వవర్గాలు. గిరిజనులు, గిరిజనేతరులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాగం
పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి జిల్లాల వారీగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎలాంటి అవరోధాలూ రాకుండా చూడాలని అధికారులను మంత్రులు ఆదేశిస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి అన్నిచోట్ల లేదని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో అధికారులు లబ్దిదారుల వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేసినా.. ఎంతమంది పట్టాలు అందుకుంటారన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల దరఖాస్తులను తిరస్కరించినట్టు సమాచారం. తక్కువ స్థాయిలోనే దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. గిరిజనేతరులను గుర్తించడం లేదని మంత్రులు తేల్చిచెబుతున్నారు. ఆన్లైన్లో వారికి సంబంధించిన సమాచారాన్ని చేర్చకపోవడంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టినట్టు అధికారులు తెలిపారు. అర్హులైన వారందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం- 2006 కింద పట్టాల మంజూరు కోసం 2021 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్ని గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల్లో పరిశీలించారు. 2,845 గ్రామ పంచాయతీల్లో గిరిజన, గిరిజనేతర రైతుల 12.49 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 4.14 లక్షల ధరకాస్తులు చేశారు. వారిలో అర్హులను ఎంపిక చేయాలి. దానికి సంబంధించి తుదిరూపు ఇచ్చేందుకు అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, 11.50 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని సమాచారం.
విచారణపై ఆరోపణలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29,949 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 20,446 దరఖాస్తులు రాగా, సూర్యాపేట జిల్లాలో 7,373, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2130 దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మిర్యాలగూడ డివిజన్లో 12,337 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 20 శాతం దరఖాస్తులకే అధికారులు ఆమోదం తెలిపినట్టు సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 66 వేల దరఖాస్తులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 248 పంచాయతీల్లోని 711 గ్రామాల్లో గిరిజనులు, ఇతర రైతుల నుంచి 66 వేల దరఖాస్తులు అందాయి. నాలుగు జిల్లాల్లో 2,27,129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్టు దరఖాస్తుదారులు సూచించారు.
మరోవైపు దరఖాస్తులు స్వీకరించి చాలారోజులు దాటినా వాటిపై ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల చేకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోడు రైతులు నిరాశలో ఉన్నారు. పోడు భూములు ఉన్న గిరిజన, గిరిజనేతర రైతులు పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో నమోదు చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 2510 దరఖాస్తులకు చెందిన 1032 ఎకరాల్లోనే సర్వే పూర్తి చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 66 గ్రామాల్లో పోడు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఆన్లైన్లో ఆప్షన్ లేని గిరిజనేతరుల దరఖాస్తులు
పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న గిరిజనేతరులను పక్కన పెట్టినట్టు తెలిసింది.. ఆన్లైన్లో వారికి సంబంధించిన ఆప్షన్ లేకపోవడంతో సబ్ డివిజన్ స్థాయిలోనే గిరిజనేతరుల దరఖాస్తుల్ని తిరస్కరించినట్టు సంగారెడ్డి, సిద్దిపేట గిరిజనాభివృద్ధి శాఖ అధికారి ఫిరంగి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 1,130 మంది గిరిజనులు 1,770 ఎకరాల్ని సాగు చేసుకుంటున్నట్టు గ్రామ స్థాయి కమిటీలో గుర్తించారు. 312 మంది గిరిజనేతరులు 509.20 ఎకరాల్ని సాగు చేసుకుంటున్నట్టు గుర్తించారు. మెదక్ జిల్లాలో 1061 మంది గిరిజనులు, 2954 గిరిజనేతరులు పోడు భూములు సాగు చేసుకుంటున్నట్టు ప్రతిపాదించారు. మెదక్ జిల్లాలో గ్రామ సభల నుంచి 510 గిరిజనులు అర్హులుగా ప్రతిపాదిస్తూ సబ్ డివిజన్ స్థాయి కమిటీకి పంపారు. అయితే, మెదక్‌లో సబ్ డివిజన్ కమిటీ 171 మంది పేర్లను మాత్రమే జిల్లా కమిటీకి పంపింది.
కొందరికేనా...?
కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లు పరిధిలోని హాబిటేషన్లు నుంచి 11532 ధరకాస్తులకు 30,684.29 ఎకరాలకు పోడు పట్టాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి విడత విచారణ పూర్తయిన క్లెయిమ్స్ ఆధారంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 10 మండలాలకు చెందిన 94 గ్రామ పంచాయతీల్లో 132 ఆవాసాల నుంచి దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ తెగలకు సంబంధించి 9,507 దరఖాస్తులు 25,515 ఎకరాల్లో హక్కు పత్రాల కోసం రాగా, గిరిజనేతరుల నుంచి 8,980 దరఖాస్తులు 17,678 ఎకరాలు, మొత్తంగా 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాల్లో హక్కు పత్రాల కోసం వచ్చాయి. అయితే, పోడు భూముల దరఖాస్తుదారుల్లో కొందరికే హక్కు పత్రాలందుతాయని గణాంకాలను బట్టి అంచనా వేస్తున్నారు.
రాష్ట్రం విజ్ఞప్తులు పట్టని కేంద్రం
2005 డిసెంబర్ 13 కంటే ముందు పోడు సాగు చేసుకున్న వారిని ఎంపిక చేయడం వల్ల అందరికీ అవకాశం ఉండదని కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రం విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. కానీ, అటవీ సంరక్షణ నియమాలు-2022 పేరుతో అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుంది. సాగు చేసుకుంటున్న గిరిజనులను ఆదుకోకుండా.. కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్రం వైఖరిని గిరిజన సంఘాలు, వామపక్షపార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
మా కల నెరవేర్చండి.. : గిరిజనులు
మా తాతతండ్రుల కాలం నుంచి పోడు భూమిని సాగు చేసుకుంటున్నాం. వర్షాధార పంటలైన పత్తి, కంది పండిస్తాం. దీనిపై వచ్చే డబ్బులతోనే బతుకుతం. కేసీఆర్ సీఎం అయ్యాక పట్టాలిస్తామని ప్రకటించారు. సీఎం సారు మా దశాబ్దాల కల నెరవేరుస్తారని చూస్తున్నం.