Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంటు కోతలపై రైతన్న ఆగ్రహం
- సబ్స్టేషన్ల ముట్టడి
నవతెలంగాణ-దిలావర్పూర్/ బెజ్జంకి
విద్యుత్ కోతలతో పైర్లు వాడుబడుతున్నాయి.. వారం పది రోజులుగా కరెంట్ కోతలపై రైతులు ఆందోళన చెందుతున్నారు.. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. నీరందక పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కోతలను నిరసిస్తూ గురువారం నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించగా.. వారికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. అధికారులను నిలదీశారు. రోడ్డుపై బైటాయించి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించి, ప్రజా రవాణాను అడ్డుకున్నారు. వారికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు దొడ్డికింది ముత్యంరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కోతలు లేని విద్యుత్ అందిస్తామని చెప్పినా ఆచర ణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. విచ్చల విడిగా కరెంట్ కోతలు విధి స్తోందని, పగటిపూట ఆరు గంటలు కూడా సరైన కరెంటు ఇవ్వలేని దుస్థితి నెల కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమ యాల్లో కరెంటు ఇవ్వడంతో రైతులందరూ పంట పొలా ల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. కరెంటు బిల్లులేమో సర్‌చార్జీల పేరుతో ఇష్టారీతిన వసూలు చేస్తున్నార న్నారు. సర్ చార్జీల పేరుతో అధిక విద్యుత్ బిల్లుల వసూలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కోతలు లేని విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఇన్చార్జి ఎస్ఐ పాకాల గీత, ఏఈ శ్రీనివాస్ నిరసనకారులను బుజ్జగించే ప్రయత్నం చేసినా ధర్నా విరమించలేదు. సీఐ వెంకటేష్, డీఈ నాగరాజు ధర్నా స్థలానికి చేరుకుని ఇక నుంచి పగటిపూట విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమిం చారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, దిలావర్పూర్ సర్పంచ్ విరేష్కుమార్, రాంపూర్ సర్పంచ్ గోవింద్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంద మల్లేష్, భాగ్యారావు, ఉమాశంకర్, అరవింద్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
బేగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా
సమయపాలన లేని విద్యుత్ సరఫరాతో వరిపైరు ఎండిపోతోందని రైతులు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. లక్ష్మీపూర్ గ్రామ రైతులు ధర్నా చేపట్టగా కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. తెగుళ్లు సోకిన పైరును కాపాడుకోవడానికి తంటాలు పడుతుంటే.. విద్యుత్ అధికారుల తీరువల్ల మొత్తానికే ఎండిపోతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి దిగ్బంధనం
జగిత్యాల జిల్లా మెట్పల్లి రూరల్ బండలింగాపూర్ గ్రామానికి చెందిన సుమారు 300 మంది రైతులు కరెంట్ కోతలను నిరసిస్తూ రోడ్డెక్కారు. గ్రామ శివారులో గల 63వ నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. పగటి పూటే త్రీ ఫేస్ కరెంట్ అందించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.