Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు ముందే..ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలి
- డబుల్ ఇండ్లు ఎప్పుడిస్తారో చెప్పాల్సిందే
- పోడు భూములపైదాగుడుమూతలొద్దు : ప్రజాసంఘాల పోరాట వేదిక ధర్నాలో వక్తలు
- అసెంబ్లీ ముగిసేలోపే సమస్యలు పరిష్కరించాలి :ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పోరాడుదాం..పేదలకు ఇండ్లు, ఇంటి జాగాలు ఇచ్చేంత వరకు.. పోరాడుదాం, పోరాడుదాం.. ఇవ్వాలి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు .. ఇవ్వాలీ, ఇవ్వాలి..ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలందరికీ పట్టాలు..ఇవ్వాలి.. ఇవ్వాలీ..కష్టజీవులపై పోలీసు నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడుదా ం..పోరాడుదా'మంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు.. సర్కారిచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు.. ముందస్తు అరెస్టులా? సిగ్గు..సిగ్గు అంటూ స్లోగన్స్. పేదలంటే అలుసా?..పెద్దలంటే ప్రేమా? అంటూ పిడికిళ్లు బిగించి గొంతెత్తిన మహిళలు.. తమ బతుకు బాధలతో ఉయ్యాల, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిన స్త్రీలు. వెరసి..పేదల బాధలన్నీ హైదరాబాద్‌కు మోసుకొచ్చిన శ్రమజీవుల నినాదాలతో గురువారం ధర్నా చౌక్ దద్దరిల్లింది. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపులో భాగంగా నిర్వహించిన ధర్నాలో ప్రజాసంఘాల నేతలు మాట్లాడారు. వేదిక నాయకులు చుక్కా రాములు, జి నాగయ్య, పోతినేని సుదర్శన్, కెఎన్ ఆశాలత అధ్యక్ష వర్గంగా ఉన్నారు.ఇంటి జాగాలు, సాగు భూముల కోసం పేదలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా పోరాడుతున్నారని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య చెప్పారు. వరంగల్‌లో ప్రారంభమైన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దన్నారు. 23 జిల్లాల్లో, 47 పోరాట కేంద్రాల్లో, నిలువ నీడలేని పేదలు ప్రభుత్వ భూముల్లో 28వేల మంది దాకా గుడిసెలేసుకున్నారనీ, సెంటు భూమి కూడా లేనివారు 78 పోరాట కేంద్రాల్లో, 11వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగుచేసుకుంటున్నారనీ, వాటికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి జాగా, ఇల్లులేని పేదలకు ఒక్కొక్కరికి 120 గజాల జాగాతోపాటు, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే, సర్కారు వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం గొప్పగా చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సగం కూడా పూర్తి కాలేదని వీరయ్య ఈ సందర్భంగా చెప్పారు. కట్టినిండ్లను పేదలకు ఇవ్వాలన్నారు. నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమకు ఇండ్లు, ఇండ్ల జాగాలు కావాలని పోరాటం చేస్తున్న పేదలపై జక్కలొద్దితో పాటు అనేక చోట్ల లాఠీ ఛార్జ్ చేశారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. కష్టజీవులైన ఈ పేదలు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదన్నారు. మంది సొమ్ము అడగటం లేదని చెప్పారు. మిగులు భూములు, శిఖం భూమినే అడుగుతున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అసెంబ్లీలో రూమ్ లేదని ఆందోళన.. పోతినేని
పేదలు, అందునా మహిళలు బట్టలు మార్చుకోటానికి చాటు లేదనీ, కన్నార్పటానికి, సేదదీరటానికి కనీసం గుడిసె లేదని ఆందోళన చేస్తుంటే.. వీటిపై మాట్లాడాల్సిన బీజేపీ శాసన సభ్యులు అసెంబ్లీలో తమకు టిఫిన్ చేయటానికి రూమ్ లేదంటూ ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీలకు రూ.19లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇండ్లు కట్టించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో భూ స్వాములకు, పెట్టుబడి దారులకే ప్రయోజనం జరుగుతున్నదని వాపోయారు.
రాజీవ్ గృహకల్ప ఇండ్లను పేదలకు పంచాలి... జూలకంటి
గత ప్రభుత్వాలు నిర్మిం చిన రాజీవ్ గృహకల్ప ఇండ్లను అర్హులైన పేదలకు పంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పలు సార్లు అధికార్ల దృష్టికి తీసుకుపోయామని గుర్తు చేశారు. 75ఏండ్ల స్వతం త్ర భారతంలో ఇప్పటికీ ఇంటి జాగా కోసం, ఇండ్ల కోసం ఆందోళన చయాల్సిన దుస్థితి రావటం బాధాకర మన్నారు. అధికారంలో ఉన్న వారు దోచుకుని దాచుకోవటం తప్ప, పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే పేదలెట్లా బతుకుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను హౌల్ సెల్‌గా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: చుక్కారాములు
పేదలు ప్రభుత్వ భూముల్లో వేసుకున్న ఇండ్లు ఒదిలిపెట్టి పోవటానికి సిద్దంగా లేరని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు చెప్పారు. పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వానికి పేదల గొంతు వినపడాలనే ధర్నా చౌక్ నుంచి నినదిస్తున్నామని చెప్పారు.
రాజీపడేదే లేదు..: టి సాగర్
కష్టజీవులైన నిరుపేదలు తాము ఉండటానికి ప్రభుత్వ భూ ముల్లో ఇండ్లే సుకుంటే.. వాటికి పట్టాలిచ్చి, ఇండ్లు కట్టిం చాల్సింది పోయి, వారిపై సర్కారు పోలీసులతో జులూం చేయిస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ తెలిపారు. పేదలు చేస్తున్న పోరాటంలో విజయం సాధించే వరకు పోరాటం ఆగదనీ, రాజీపడేదే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పాడై పోతున్నాయన్నారు. పీఎంఏవైలో కోటి 20లక్షల ఇండ్లను ఇచ్చామంటున్నారనీ, ఈ రాష్ట్రానికి ఎన్నిండ్లు ఇచ్చారో..? ఎక్కడ ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టించుకునేవారే కరువయ్యారు.. : జి నాగయ్య
సెంటు భూమి లేని పేదలు తమకు తల దాచుకునేందుకు గుంట భూమి కావా లని అడిగితే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అనేక సార్లు అధికారులను కలిసి అర్జీలిచ్చామన్నారు. పేదలంతా ఒక్కటై దండు కట్టి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతారని చెప్పారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలి: డీజీ నర్సింహారావు
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను తక్షణం పూర్తి చేసి పేదలకు కేటాయించాలని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు డిమాండ్ చేశారు.పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక, ఇండ్ల స్థలాలు లేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని చెప్పారు.
అభివృద్ది అంటే..పేదల బతుకులు మారటం..: ఎండీ అబ్బాస్
పేదల బతుకులు మారకుండా దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందబోదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ చెప్పారు. ఇప్పటికీ 50శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. అందరికీ విద్యా, వైద్యం, తిండి, బట్ట, ఇండ్లు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
పూర్తయినా కేటాయించలే..: వెంకట్రాములు
ప్రభుత్వం ఇస్తామంటూ సాగదీస్తున్న డబుల్ బెడ్రూమ్లను పేదలకు ఎందుకు కేటాయించటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ప్రశ్నించారు. పేదలు గుడిసెలేసు కుంటే ఎందుకు ఖాళీ చేయమం టున్నారో అర్థం కావటం లేదన్నారు. వారికి ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పారు.
పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం..
పేదలకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదనీ, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగు భూములకు పట్టాలు, పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేశ్, జీఎంపీఎస్ ప్రaధాన కార్యదర్శి ఉడుత రవీందర్, మత్స్య కార్మికుల, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెల్లెల బాలకృష్ణ, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె వెంకటేశ్, భూపాల్, ఉపాధ్యక్షులు ఎస్వి రమ, బుర్రి ప్రసాద్, కోట రమేశ్ పి.శ్రీకాంత్, కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉంటే..ఫలితం వస్తుంది..హైమావతి
ఇండ్లు సాధించుకునే వరకు పోరాటాన్ని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి ఆపొద్దన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే విజయాలు సిద్దిస్తాయని చెప్పారు. సర్కారు మాటలు నీటి మూటలుగా ఉన్నా యన్నారు. ఎన్నికల సమయంలో పేదల కిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మిని ముందస్తు అరెస్టు పేరుతో నిర్బంధించటమేంటని
ప్రశ్నించారు.
పేదల గోస ప్రభుత్వ పెద్దలు వినాలే.. పాలడుగు భాస్కర్
పేదల గోస ప్రభుత్వ పెద్దలు వినాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ చెప్పారు. 'మేం ప్రయి వేటు జాగాలను కబ్జా చేయలే..ప్రభుత్వ భూమిలోనే గుడిసెలేసుకున్నం' ఇది నేరం కాదు..అయినా పేదలపై దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలు తల దాచుకునేందుకు గుంట భూమివ్వరు గానీ.. ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు, ప్రగతి భవన్‌కు, రింగు రోడ్లకు మాత్రం భూములెక్కడివని ప్రశ్నించారు. బడా బాబులకు కార్పొరేట్లకు కార్పెట్లు పరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.