Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్‌ను బాంబులతో పేల్చడమే కాంగ్రెస్ విధానమా? : శాసనసభలో మంత్రి కేటీఆర్
- పద్దులపై చర్చ సందర్భంగా శ్రీధర్‌బాబుపై మంత్రి ఫైర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌లో ఏమైనా లోపాలుంటే సరిచేస్తాం గానీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టాన్ని కమీషన్ల వసూలు కోసం వాడుకుంటున్నవారికి, దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని, ప్రయివేటు వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసేవాళ్లకు ధరణి పోర్టల్ ఇబ్బందిగా మారిందని ఎద్దేవాచేశారు. అందుకే వారు గొంతులు చించుకుంటున్నారని విమర్శించారు. ఆ పోర్టల్ రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. గురువారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతుండగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. దీంతో పరిస్థితి కేటీఆర్ వర్సెస్ దుద్దిళ్ల అన్నట్టుగా తయారైంది. కేటీఆర్ మాట్లాడుతూ.. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానామా? అని కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు. ఆరేండ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయనీ, ధరణి తెచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 23.92 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని వివరించారు. ధరణిలోని చిన్నచిన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూపించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ధరణిని రద్దు చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమైతే స్పష్టం చెప్పాలని అడిగారు. ఆ పార్టీ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? అదే అయితే చెప్పండి? అని ప్రశ్నించారు. ఏదో అవకాశం దొరికింది..రాజకీయంగా చేయాలిగనుక విమర్శ చేద్దామనుకునే ధోరణి విడనాడి అర్ధవంతంగా చర్చలో పాల్గొనాలని హితవు పలికారు. ఫార్మాసిటీకి రైతుల నుంచి రూ.8 లక్షల భూమిని తీసుకుని రూ.1.38 కోట్లకు ప్రభుత్వం ఎక్కడ అమ్మిందో ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. సభను పక్కదోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. అసత్యపు మాటల్ని వెనక్కి తీసుకోవాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరారు. ఒకవేళ ఆయన వెనక్కి తీసుకోకపోతే రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారనీ, ఆయన్ను సమర్ధించేలా సభలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ఆ పార్టీకి అంటూ ఒక వైఖరి ఉందా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదని విమర్శించారు. అందుకే అది ఎక్కడా కాకుండా పోతుందనీ, వారికి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావడం లేదని చెప్పారు. ఇప్పటికైనా ఆ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.
టైటిల్ గ్యారంటీ యాక్టు తేవాలి : దుద్దిళ్ల
రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ యాక్టు తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ధరణి సమస్యల పరిష్కారంపై సూచనలు, సలహాల కోసం అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. మాజీ సైనికుల భూములను నిషేధితజాబితా నుంచి తొలగించాలని కోరారు. ఆధార్ అనుసంధానం లేకుండా హక్కుల మార్పిడి జరగడం లేదని చెప్పారు. ఒకే డాక్యుమెంట్ ద్వారా గిప్టు ఇచ్చేలా చూడాలన్నారు. గుంట భూమి వివాదంలో ఉన్నా మొత్తం ఆ సర్వేనెంబర్లన్నింటినీ బ్లాక్‌లిస్టులో పెట్టడం తగదన్నారు. అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన భూములను తీసుకుని ఆక్షన్ చేయడం సరిగాదన్నారు. హరితహారం కోసం అసైన్డ్ భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం భూములను లాక్కుని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నదని ఆరోపించారు. ఫార్మాసిటీలో రూ.8 లక్షలకు సేకరించిన భూమిని రాష్ట్ర సర్కారు రూ.కోటీ 38 లక్షలకు అమ్ముకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని కోరారు. ల్యాండ్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.83 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందనీ, ఇంత వరకు సర్వే ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ల్యాండ్ సర్వే దాదాపు పూర్తికావచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. రైసుమిల్లర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతున్నదని వాపోయారు. రైతులను మిల్లర్లు దోచుకుంటున్న తీరును సభలో వివరించారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలనీ, ఇసుక లారీలు తిరగటం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతు చేయాలని కోరారు.
ఇసుకతో రూ.800 కోట్ల ఆదాయమొచ్చింది : ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయమొస్తే..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అది రూ.800 కోట్లకు చేరిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సభ్యులొచ్చి ఇసుక మాఫియా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బులు ఎక్కడకు పోయాయి? అని ప్రశ్నించారు. పద్దులపై చర్చించకుండా ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఆ పార్టీ సభ్యులకు అలవాటైపోయిందని విమర్శించారు.
దుద్దిళ్ల వ్యాఖ్యలను తొలగిస్తున్నాం : స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను పదేపదే సూచించినా వెనక్కి తగ్గకపోవడం సరిగాద న్నారు.'సమయం ఇవ్వటం లేదంటారు. ఇస్తే వినియోగించుకోరు. నిమిషం అంటారు ఐదు నిమిషాలు మాట్లాడుతున్నరు. నేను మంత్రి ఉన్నప్పుడు భూముల సమస్యపై దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాడో నాకైతే తెలియదు. మాట్లాడినట్టు చెప్పడం సరిగాదు' అని స్పీకర్ అన్నారు.