Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సగానికి పడిపోయిన పసుపు ధర
- రెండు విధాలుగా రైతాంగానికి నష్టం
- ఈ యేడు తగ్గిన దిగుబడి
- సాగు తగ్గించుకుంటాం : రైతన్నలు
ఈ సీజన్లో పసుపు ధర అమాంతం పడిపోయింది. గతేడాదితో పొల్చితే ఏకంగా సగానికి రేటు పడిపోవడం రైతన్నలను తీవ్రంగా కలిచివేస్తోంది. గతేడాది ఈ సమయానికి రూ.8,500 పలికిన క్వింటా ధర.. ప్రస్తుతం కేవలం రూ.4000-రూ.4200 పలుకుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. ఈ యేడాది భారీ వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయిందని దిగులు చెందుతున్న రైతులకు మార్కెట్లో ధర తీవ్ర కలవరం పెడుతోంది.
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాకు కేవలం రూ.5910 మాత్రమే పలకడం గమనార్హం. ఒక పసుపు డ్రమ్ము ఉడికించే వరకు రైతుకు అన్నీ ఖర్చులు కలుపుకుని రూ.3,700 అవుతుంటే.. మార్కెట్లో ప్రస్తుతం రూ.2,500 వరకు మాత్రమే వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా డ్రమ్ము పసుపుకు రూ.1200 వరకు నష్టపోతున్నామని, ఇకపై మెల్లిమెల్లిగా సాగు తగ్గిస్తామని రైతులు పేర్కొంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ యేడాది 30 వేల ఎకరాల్లో పసుపు పంట సాగయ్యింది. సాధారణంగా 35 వేల ఎకరాల వరకు పంట సాగవ్వాల్సి ఉండగా.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. అయితే ఈ యేడాది అధిక వర్షాలు రైతును నిండాముంచాయి. అధిక వర్షాల వల్ల పంటలోకి నీరు చేరి దుంప తెగుళ్లు సోకి ఆ ప్రభావం దిగుబడిపై పడింది. ఏదో విధంగా పంటను కాపాడుకుని తీరా మార్కెట్‌కు పంట తీసుకొస్తే మార్కెట్లో ధరలు అమాంతం పడిపోయాయి. ఓ వైపు పెద్దఎత్తున పంట వచ్చి మార్కెట్ చేరుతుంటే.. మరోవైపు మార్కెట్లో ధర తగ్గింది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్‌కు ప్రతిరోజూ ఐదు వేల క్వింటాళ్ల పసుపు వచ్చి చేరుతోంది. గత ేడాది గరిష్ట ధర రూ.9800 వరకు పలకగా.. ప్రస్తుతం గురువారం రైతు లకు వచ్చిన గరిష్ట ధర రూ.5910 కావడం గమనార్హం. ఇక కనిష్టంగా రూ.4000 పలుకుతోంది. సగటున రూ.5050 వరకు ధర వస్తోంది. మెజార్టీ రైతులకు రూ.4500 నుంచి రూ.5000 వరకు మాత్ర మే ధర పలుకుతోంది. దీంతో రైతు లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి పంట మార్కెట్‌కు రాగానే ధరలు తగ్గిపోతున్నాయని వాపోతు న్నారు. ప్రస్తుత ధరతో డ్రమ్ముకు రూ.1200 వరకు నష్టపోతున్నామని చెబుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌కు ఆర్మూర్ డివిజన్‌తో పాటు జగిత్యాల, మెట్పల్లి నుంచి కూడా రైతులు పసుపు తీసుకొస్తున్నారు. చివరకు తమకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని చెబుతున్నారు.
ఈ-నామ్ ఉన్నా ధరలు సున్నా..
ఈ-నామ్ విధానంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని అధికారులు, నాయకులు చెబుతున్నప్పటికీ.. ఆ ప్రయోజనం పసుపు రైతులకు దక్కడం లేదు. దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు తమ పంటలను కొనుగోలు చేస్తారన్నది ఉత్తమాటగానే మిగిలింది. ఈ యేడాది పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
క్వింటాకు రూ.4060 మాత్రమే వచ్చింది : ఈ లింగారెడ్డి, ఇబ్రహింపట్నం, జగిత్యాల
ఈ సంవత్సరం రెండు ఎకరాల 5 గుంటల్లో పసుపు పంట సాగు చేశాను. నిజామాబాద్ మార్కెట్‌కు పంట విక్రయానికి తీసుకొస్తే క్వింటాకు కేవలం రూ.4060 మాత్రమే పలికింది. గతేడాది క్వింటాకు రూ.8400 ధర వచ్చింది.
పంట సాగు తగ్గిస్తాం : రాజరెడ్డి
పసుపు పంటతో ప్రతియేడాది లాభాల కన్నా నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. పంట చేతికి వచ్చిన సమయంలో రేట్లు పడిపోతున్నాయి. ఇది ఓ తంతుగా జరుగుతోంది. అందుకే పసుపు పంట సాగు తగ్గిస్తున్నాం. గతేడాది మూడు ఎకరాల్లో పంట సాగు చేస్తే.. ఈ రెండు ఎకరాలకు తగ్గించాను. వచ్చే యేడాది పూర్తిగా మానేస్తాను. క్వింటాకు రూ.4500 ధర పలికింది.