Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణశాఖ స్థలాల్లో కేంద్రం అనుమతులు ఇవ్వట్లేదు
- అసెంబ్లీలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రార్థనా మందిరాల నిర్మాణంపై త్వరలో ప్రత్యేక చట్టం తెస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. గుజరాత్లో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీ ఈ తరహా చట్టాన్ని తెచ్చారనీ, దాన్ని అధ్యయనం చేసి, మార్పులు చేర్పులతో కొత్త చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు. రోడ్ల విస్తరణకు ప్రార్థనామందిరాలు ప్రధాన అడ్డంకిగా ఉంటున్నాయనీ, దాన్ని అధిగమించేందుకు గుజరాత్ తరహా చట్టం తేవాలని సుధీర్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. దానిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...'ఏ దేవుడూ, భక్తులు దుమ్మూ ధూళిలో ఉండాలని కోరుకోరు. రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనామందిరాలను తొలగించి, మరో ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేస్తాం' అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ అభివృద్ధి పనులకు రక్షణ శాఖ స్థలాల్లో అనుమతులు ఇవ్వకపోవడంపై సభలో ప్రస్తావించారు. దీనిపై కూడా మంత్రి సమాధానం చెప్పారు. గడచిన ఎనిమిదన్నరేండ్లలో కంటోన్మెంట్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రుల్ని పలు దఫాలు కోరినా, సహకరించలేదని అన్నారు. 'నలుగురు కేంద్ర రక్షణ శాఖ మంత్రులు మారారు. వారందరికీ విన్నవించాం. ఎవరూ సహకరించలేదు. సమస్యను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. రాష్ట్రంలోని రక్షణ శాఖ స్థలాలను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించలేదనే వాస్తవాన్ని గమనించాలి' అని చెప్పారు. దేశరక్షణకు సంబంధించిన అంశం కాబట్టే తాము సంయమనంతో ఉంటున్నామనీ, అవసరమైతే దీనిపై న్యాయపోరాటానికీ సిద్ధంగా ఉన్నామన్నారు. రక్షణశాఖ స్థలాలు ఉన్న చోట్ల ఇతర పట్టణాలతో అభివృద్ధి పనుల అనుసంధానం జరగట్లేదన్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులను మంత్రి వివరించారు. ఎమెల్యే అరికెపూడి గాంధీ తమ నియోజకవర్గంలోని పనులను ప్రస్తావిస్తూ, వాటిని వేగవంతం చేయాలని కోరారు.