Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కాలేజీలకు అక్రమ ర్యాంకులపై 'లై డిటెక్టర్' నిర్వహించాలి
- ఇంటర్ పరీక్షలపై విద్యార్థుల్లో నమ్మకం కలిగించాలి
- సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మార్చిలో నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షలను నిజాయితీగా, నిక్కచ్చిగా నిర్వహిం చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) కోరింది. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో నమ్మకం కలిగించాలని సూచించింది. ఇంటర్ విద్య, బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి మధుసూదన్‌రెడ్డి చేసిన అవినీతిపై సీఐడీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఇంటర్ బోర్డు చైర్మెన్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ గురువారం ఆన్లైన్ ద్వారా వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీలకు అక్రమంగా ర్యాంకులు, మార్కులు రావడంపై మధుసూదన్‌రెడ్డిపై 'లై డిటెక్టర్' పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఆయనకు సహకరించిన అధికారుల పాత్రను బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సీసీ కెమెరాల ట్యాంపరింగ్ జరిగిందంటూ ప్రకటించారని గుర్తు చేశారు. కార్యాలయ కంప్యూటర్ పాస్వర్డ్ ప్రైవేటుగా వాడుతున్నట్టు చెప్పారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. ఈ దశలో సస్పెండైన మధుసూదన్‌రెడ్డి ఇంటర్ బోర్డు ప్రతిష్టను మంటగలుపుతూ, అధికారులపై ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపకుంటే ఇంటర్ పరీక్షలు, ఫలితాల్లో మళ్లీ గందరగోళం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దెబ్బతీయాలనుకుంటున్న ఇలాంటి కుట్రలను అరికట్టాలని కోరారు.