Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 10 గంటలకు ప్రారంభమై
- రాత్రి 10.50 గంటలకు ముగిసిన అసెంబ్లీ
- పద్దులపై గురువారం సభలో సుదీర్ఘ చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలనే తాపత్రయమో..? లేక కచ్చితంగా ఆదివారం నాటికి సమావేశాలను ముగించాలనో ఆతృతో తెలియదు గానీ గురువారం రాష్ట్ర శాసనసభను ప్రభుత్వం ఏకంగా 12 గంటలకు పైగా కొనసాగించింది. ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభ.. రాత్రి 10.50 గంటలకు పద్దులపై చర్చతో ముగిసింది. ఈ రకంగా 12 గంటలా 50 నిమిషాలపాటు సుదీర్ఘంగా సభ కొనసాగటం బీఆర్ఎస్ రెండో దఫా ప్రభుత్వంలో ఇదే మొదటిసారి. సభలో పద్దులపై చర్చ సందర్భంగా గురువారం సాయంత్రం... బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది తమ ప్రభుత్వమేనని గంగుల ఈ సందర్భంగా తెలిపారు. 2023-24 బడ్జెట్లో వారి సంక్షేమం కోసం రూ.6,229 కోట్లను కేటాయించామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. రైతుల సంక్షేమం, పేదల కడుపు నింపటమే పౌర సరఫరాల శాఖ కర్తవ్యమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో కేవలం ఎనిమిదిన్నరేండ్లలోనే తమ శాఖ ఎన్నో అద్భుతాలను చేసిందని వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. ఈ కాలంలో రోడ్ల నిర్మాణం కోసం రూ.17,232 కోట్లను ఖర్చు చేశామనీ, తద్వారా 8,672 కిలో మీటర్ల మేర రోడ్లను వేశామని తెలిపారు. గిరిజనుల జనాభా శాతం కంటే అధికంగా నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సత్యవతి రాథోడ్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్హులైన గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలిస్తామని ఆమె హామీనిచ్చారు.