Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీకి సై అంటున్న పలువురు అభ్యర్థులు
- ఇప్పటికే ప్రచారంలో నిమగం
- ఉపాధ్యాయులను ఆకర్షించేందుకు ప్రయత్నం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 16 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తామనీ, మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూల్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి పదవీకాలం ఈనెల 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు సై అంటున్నారు. ఈసారి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉండే అవకాశమున్నది. ఇప్పటికే పలువురి పేర్లను ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ప్రకటించాయి. వారిలో చాలా మంది ప్రచారంలో నిమగమయ్యారు. ఈ నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలనూ వారు కలియ తిరుగుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మమేకమయ్యేందుకు, వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎవరికన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. ఎవరికి వారు తమకంటే, తమకంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పార్టీ నుంచి ఇంత వరకు అధికారికంగా ప్రకటన రాకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో 15,425 మంది పురుష టీచర్లు, 14,074 మంది మహిళా ఉపాధ్యాయులు కలిపి మొత్తం 29,501 మంది ఓటర్లున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 8,687 మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 6,771 మంది, హైదరాబాద్‌లో 3,775 మంది, మహబూబ్‌నగర్‌లో 3,567 మంది, వికారాబాద్‌లో 1,937 మంది, నాగర్‌కర్నూల్‌లో 1,804 మంది, వనపర్తిలో 1,399 మంది, జోగులాంబ గద్వాలలో 873 మంది, నారాయణపేట్‌లో 688 మంది ఉన్నారు. తొమ్మిది జిల్లాల్లో కలిపి 126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బహుముఖ పోటీ...
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఈసారి అధిక సంఖ్యలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశమున్నది. టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థిగా పాపన్నగారి మాణిక్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి బి భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, టీపీటీఎఫ్ నుంచి వినరుబాబు, బీజేపీ నుంచి ఎవిఎన్ రెడ్డి, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, ఎల్సీ జీటీఏ నుంచి ఎస్ రవీందర్, బీసీటీఏ నుంచి విజరుకుమార్, టీయూటీఎఫ్ నుంచి మల్లారెడ్డి, టీఎస్టీసీఈఏ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అయినేని సంతోష్‌కుమార్ ప్రస్తుతానికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. మరికొంత మంది అభ్యర్థులు వివిధ సంఘాల నుంచి పోటీ చేసే అవకాశమున్నది. తెలంగాణ సీపీఎస్ యూనియన్ నుంచి అభ్యర్థి బరిలో ఉంటారని చెప్పినా ఇంత వరకు పేరు ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ జరగనుంది.
ఎవరికి లాభం... ఎవరికి నష్టం...
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది. ఇది ఏ అభ్యర్థికి కలిసొస్తుందనే చర్చ ఉపాధ్యాయుల్లో ఉన్నది. పండితులు, పీఈటీలకు పదోన్నతులు రాకపోవడంతో వారు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే సహాయ నిరాకరణ చేస్తున్నారు. నిషేధం విధించిన 13 జిల్లాల్లో భార్యాభర్తలకు సంబంధించి కేవలం 615 మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎస్జీటీలను మాత్రం ఒకే జిల్లాకు పంపేందుకు సుముఖంగా లేదు. దీంతో స్పౌజ్ టీచర్లు అసంతృప్తితో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో 317 జీవో ద్వారా స్థానికతను వదిలి వేరే జిల్లాకు బదిలీ అయిన వారికి రెండేండ్ల సర్వీసు లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ స్థానిక జిల్లాకు రావాలన్న వారి ఆకాంక్ష నెరవేరడం లేదు. దీంతో సుమారు 22 వేల మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల అంశం ఎవరికి లాభం కలిసొస్తుందో, అసంతృప్తితో ఉన్న టీచర్లు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారో ఎవరికి నష్టం కలిగిస్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది. డీఏలు పెండింగ్‌లో ఉండడం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా మూడు వేల వరకు ఓటర్లుగా ఉన్నారు. వారు ఏ అభ్యర్థికి అనుకూలమనేది ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు సుమారు తొమ్మిది వేల మంది ఓటర్లుగా ఉన్నారు. వారు ఎవరికి ఓటేస్తారన్నది కీలకంగా ఉన్నది. టీఎస్‌యూటీఎఫ్ నుంచి పోటీ చేసే పాపన్నగారి మాణిక్‌రెడ్డికి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అండగా నిలబడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం టీఎస్‌యూటీఎఫ్ అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టు అధ్యాపకులు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో మాణిక్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నది.