Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పులకు ఎంఐఎం కౌంటర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అల్పసంఖ్యాక వర్గాల వారికి బ్యాంకు రుణాల మంజూరీ పథకంపై తాము అడిగిన ప్రశ్నకు మంత్రి చెప్తున్న సమాధానానికి సంబంధం లేదని ఎంఐఎం సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ 2016-17 నుంచి 2021-22 మధ్యకాలంలో మైనారిటీ వర్గాల నుంచి బ్యాంకు రుణాల మంజూరీ పథకం కింద దరఖాస్తులు తీసుకోని విషయం వాస్తవమేనా? అని ప్రశ్నించారు. దీనికి అనుబంధంగా స్వీకరిస్తే ఆ దరఖాస్తుల సంఖ్య ఎంత? మంజూరీలు ఎన్ని? అసలు ఈ ప్రక్రియ ఏ దశలో ఉంది? ఐదేండ్లలో పథకాల వారీగా బడ్జెట్ మంజూరీ, వాస్తవ వ్యయాలు ఎంత? అని ప్రశ్నలు అడిగారు. దీనికి ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్తూ డ్రైవర్ సాధికార కార్యక్రమం కింద లబ్దిదారుల వివరాలను సుదీర్ఘంగా చెప్తుండగా, ఎంఐఎం ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలని కోరారు. దీనిపై మంత్రి సభ్యులు అడిగిన కాలంలో దరఖాస్తులను స్వీకరించామనీ, కొందరికి బ్యాంకు రుణాలు ఇచ్చామనీ చెప్పుకొచ్చారు. 2016-17లో మైనారిటీల ఆర్థిక సంస్థ డ్రైవర్ సాధికార కార్యక్రమం కింద 3,500 దరఖాస్తులు వస్తే, 409 మందికి బ్యాంకు రుణాలు మంజూరైనట్టు తెలిపారు. 2019-20లో 14,351 దరఖాస్తులు వస్తే, 300 మంది లబ్దిపొందారని వివరించారు. 2018-19, 2021-22లో క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థ డ్రైవర్ సాధికార పథకానికి 503 దరఖాస్తులు వస్తే, 218 మంది లబ్దిపొందినట్టు చెప్పారు. అలాగే బ్యాంకు ద్వారా పొందే రుణ పథకానికి 2019-20లో 3,221 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు వస్తే, వెయ్యి యూనిట్లు అనుతించామనీ, 113 మందికి సబ్సిడీ విడుదలైందని చెప్పారు. ఈ సమాధానాల పట్ల ఎంఐఎం సభ్యులు సంతృప్తి చెందలేదు.