Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డి.రవీంద్రన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు చెరుకు ధర నిర్ణయించాలనీ, టన్నుకు రూ.5వేలకు తగ్గకుండా ధర కల్పించాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 6న చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డి. రవీంద్రన్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10.25 శాతం రికవరీ కోసం టన్ను చెరుకు ధరను రూ.3050, 9.5 శాతం రికవరీకి టన్నుకు రూ.2821 ధరను ప్రకటించిందని తెలిపారు. కేంద్రం ఈరకంగా టన్నుకు రూ.150 ధర పెంచిందనీ, రికవరీ రేటును కూడా 0.25శాతం పెంచిందన్నారు. అయితే డీజిల్, యంత్రాలు, ఎరువుల ధరల పెరుగుదల కారణంగా చెరుకు ఉత్పత్తి ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల కేంద్రం పెంచిన ధర ఏ మూలకూ సరిపోవడం లేదన్నారు. ఈ రకంగా మోడీ సర్కారు చెరుకు రైతులకు ద్రోహం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా చెరుకు రైతులకు, 50 లక్షల మంది కార్మికులకు నిరాశే మిగిలిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం టన్ను చెరుకుకు రూ.5,000 ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బొంతు రాంబాబు మాట్లాడుతూ...రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిందన్నారు. సాగుదారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో మూడు చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్, రోటవేటర్, హర్వెస్టర్లను సబ్సిడీ ద్వారా అందించాలనీ, సమగ్ర చెరుకు విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.