Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోపణలపై విచారణ జరిపించాలి
- అరెస్టులకు భయపడేది లేదు
- ప్రగతి భవన్‌ను.. అంబేద్కర్ స్టడీ సెంటర్‌గా మారుస్తాం: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్ఆర్ఐ కంపెనీలను బెదిరించి వంద ఎకరాల భూమిని తన మిత్రులు, దళారుల పేర్లతో బదలాయించి వేలకోట్లు కొల్లగొట్టిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి డ్రామారావు (కేటీఆర్) తనని దందాలకు పాల్పడుతున్నాడని అసెంబ్లీ వేదికగా అనటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ధరణి పేరుతో ఎన్నో కుంభకోణాలకు అడ్డాగా మారిన తెలంగాణను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విముక్తులను చేస్తామని తెలిపారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన 'హాత్ సే హాత్' జోడో యాత్ర మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి గురువారం చేరుకుంది. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ఎంపీ మాలోత్ కవిత తనపై చేసిన ఆరోపణలకు రేవంత్‌రెడ్డి మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సమాచార చట్టాన్ని వాడుకుని భూదందాలకు పాల్పడుతున్నాడని మంత్రి డ్రామారావు ఆరోపిం చడం సిగ్గుచేటన్నారు. ధరణి లోపాలను, దందాలను త్వరలోనే బయట పెడతామని, తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని స్పష్టంచేశారు. ఆర్టీఐ చట్టం ద్వారా ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కబ్జాలు, దందాలు వెలికితీస్తున్న తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు కొడుకు చేసే అక్రమాలు తెలియకుండా ఉన్నాయా ? ధృతరాష్ట్రుడిలా కండ్లు మూసుకుని ఉన్నాడా? అంటూ కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబం 2014 నుంచి ఇప్పటి వరకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా మార్చారని, వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన ప్రతి కలెక్టర్‌ను కటకటాల్లోకి నెడుతుందన్నారు. ధరణి పోర్టల్ అనేది ఐఅండ్ఎఫ్ఎస్ కంపెనీకి ఇచ్చి ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేశారన్నారు. ధరణి పోర్టల్ ద్వారా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేటీఆర్ చేసిన భూదందాలపై విచారణ జరిపించాలన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కేసులు పెట్టారని, ఎన్నోసార్లు అరెస్టులు చేశారని, అరెస్టులకు ఎన్నడూ భయపడలేదన్నారు. యాత్ర విజయవంతం అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని భయపడి ఇలాంటి అప్రజాస్వా మిక చర్యలకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్‌ను.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మార్చి తెలంగాణలోని యువతకు విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని తెలిపారు.
మూడు నిర్ధిష్ట ఆరోపణలపై విచారణ జరపాలి..
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న తెల్లపూర్ భూములు టిస్మన్స్పియర్ అనే అమెరికన్ కంపెనీని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఆ సందర్భంలో రూ.460కోట్లు చెల్లించి కంపెనీ కొనుగోలు చేయగా, స్థానిక వివాదంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. అనంతరం తెలంగాణ ఏర్పడ్డాక 2021లో కేటీఆర్ అండ్ కంపెనీ బెదిరింపులకు పాల్పడి రూ.260కోట్లకు ప్రతిమ శ్రీనివాస్ పేరుతో కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు.
మియాపూర్ ప్రాంతంలో రూ.500కోట్ల విలువైన భూమి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. సర్వే నెం.80లో ఐదెకరాల భూమి ఎక్కడినుంచి వచ్చిందని, రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పలేదని, డాక్యుమెంట్ ప్రూఫ్‌తో మాట్లాడుతున్నానని, మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానంటూ అధికారులు ధ్రువీకరించిన పత్రాలు చూపిస్తూ సవాల్ విసిరారు.