Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌కు వినియోగిస్తే.. సాగు, తాగునీటికి కష్టం
- ముచ్చుమర్రి దగ్గర ఆగని నీటి వాడకం
- కనీస స్థాయికి పడిపోయిన నీటి నిల్వలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వేసవితోపాటే తాగు, సాగు నీటి సమస్య దగ్గరవుతోంది.. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు రబీలో సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతలకు నీరు ఇచ్చే శ్రీశైలం రిజర్వాయరు వట్టిపోతోంది. 215 టీఎంసీలకు ఇప్పుడు మిగిలింది 50 టీఎంసీలు మాత్రమే. ఆవిరి, లీకేజీలు పోను మిగిలేది 40 టీఎంసీలు మాత్రమే. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ విద్యుత్ తయారీ ఆపకపోవడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో క్రమంగా రిజర్వాయర్లలో నీరు తగ్గిపోతోంది. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరిచ్చేందుకు సైతం రిజర్వా యర్లలో నీరు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయరులో 215 టీఎంసీలకు ప్రస్తుతం 50 టిఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గతేడాది వేసవిలో తగిన నీరు అందుబాటులో లేక శ్రీశైలం నుంచి దిగువకు పోయిన నీటిని తిరిగి పంపింగ్ చేసుకొని వాడుకొనే పరిస్థితి వచ్చింది. ఈసారి ఇప్పటికే రిజర్వాయరులో నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయాయి. అయి నా.. తెలుగు రాష్ట్రాలు విద్యుత్ తయారీ ఆపడం లేదు. 30 టీఎంసీల డెడ్ స్టోరేజీ దగ్గర నీటి నిల్వను నిలిపేయాల్సింది. మిగిలిన నీటిని విద్యుత్‌కు గాకుండా తాగు, సాగు నీటికి ఉపయోగించాల్సి ఉన్నది. వేసవిలో తాగునీటితోపాటు పంటలు ఎండి పోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ఎగువన ముచ్చుమర్రితో పాటు పోతిరెడ్డి పాడు ద్వారా నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడటం వల్ల వేసవిలో నీటి సమస్య వస్తుందనే విమర్శలు ఉన్నాయి.
ప్రధాన నీటి వనరులదీ అదే పరిస్థితి
జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులైన ఎల్లూరులో 8.865 టీఎంసీల నీరు ఉంది. జూరాల 1.4, కోయిల్ సాగర్ 1.3, రామన్‌పాడు 1.2, గోపల్దిన్నే 0.110, శంకర్‌సముద్రం 0.120 టీఎంసీల నీటి ని ల్వలున్నాయి. ఇవి ప్రస్తుతం సాగు నీటితోపాటు తా గునీటికి ఉపయోగ పడుతున్నాయి. జిల్లాలో 71 మండలాలు 2137 ఆవాసాలకు అవసరమైన తాగు నీటిని అందించాల్సి ఉంది. ఐదు జిల్లాలకు వేసవి మూడు 14 టీఎంసీల నీరు అవసరముంటుంది.
రబీ సాగుకు తప్పని కష్టాలు
ఉమ్మడి జిల్లాలో ఏటా రబీ సాగుకు కష్టాలు తప్పడం లేదు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో వరి పంట అధికంగా సాగువుతోంది. ఎక్కువ మంది రైతులు మిర్చి, వేరుశనగ పంటలను కెఎల్ఐ కాల్వల ద్వారా వచ్చే నీటి ఆధారంగా సాగు చేశారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం వల్ల సాగు నీరు ఇవ్వడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వనపర్తి, కోల్లాపూర్ పరిధిలో ఉండే భూములకు వచ్చే జూరాల నీటికి వారబందీ పెట్టారు. వారం రోజులు సాగు నీళ్లు వస్తే.. మరో వారం రోజులు నిలిపేస్తారు. ఇక వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి వంటి చివరి ఆయకట్టుకు సాగునీరు రావడం లేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చేవరకు పొలాలకు సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పాలక వర్గాలకు ముందు చూపు కరువు
నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి విషయంలో ఒక విధానం అంటూ లేకుండా పోయింది. నీళ్లు ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాడటం సరికాదు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి వల్ల సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా మారనున్నది. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూడాలి.