Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో వీఓఏల వేతనాలు పెంచాలి
- సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి
- భిక్షమెత్తుకోం..పోరాడి సాధించుకుంటాం : ఐకేపీ వీఓఏ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ధరలు పెరిగాయని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వేతనాలు పెంచుకున్నారు. పేదరిక నిర్మూలనలో రాష్ట్రానికి అవార్డులు తీసుకొచ్చిన ఐకేపీ వీఓఏల వేతనాలు పెంచరా? రూ.3,900 వేతనంతో ఇల్లెట్ట గడుస్తది. కార్మికులు భిక్షమెత్తుకోవడానికి రాలేదు. పోరాడి మా హక్కులను సాధించుకుంటాం. వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్యపార్కు వద్ద శుక్రవారం తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వీఓఏలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి సీట్లు అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి, తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేనివా? వీటి గురించి అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారు 39 రకాల పనులు చేస్తున్నారని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సభలకు మహిళా సంఘాల సభ్యులను తరలించడం మొదలుకుని సభను విజయవంతం చేసే వరకు వీఓఏలు కష్టపడుతుంటే వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు, రూ.10 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్, తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు ఎస్.రమ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్, నగేష్ మాట్లాడారు. వీఓఏలు గెజిటెడ్ ఆఫీసర్ల కంటే ఎక్కువ పనులు చేస్తున్నా గుర్తింపు లేదన్నారు. పైగా సర్వేల పేరుతో ప్రభుత్వం వేధిస్తోం దన్నారు. 'అర్హులైన వీఓఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి. గ్రేడింగ్‌తో సంబంధం లేకు ండా ప్రతి నెలా వేతనాలు ఇవ్వాలి. సెర్ప్ నుంచి వీఓఏలకు ఐడి కార్డులు ఇవ్వా లి. ఏకరూప వస్తువుల యూనిఫాం ఇవ్వాలి. మహిళా వీఓఏలకు ప్రసూతి సెలు వులు ఇవ్వాలి. ఎస్‌హెచ్‌జీ/వీఓ లైవ్ మీటింగ్‌లను రద్దు చేయాలి' అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం కోశాధికారి సుమలత, ఆఫీసుబేరర్లు వర్షబేగం, సుధాకర్, శరత్, శోభారాణి, అరుణ, అనిత, రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు మౌనిక, ఉద్యోగులు పాల్గొన్నారు.
అరెస్టులు
ధర్నాకు ఆయా జిల్లాల నుంచి వస్తున్న వీఓఏలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, నల్లగొండ, సూర్యపేట, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి బయలుదేరిన వీఓఏలను మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారు.