Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11.5 లక్షల ఎకరాలు పంచుతాం...
- రైతుబంధు, రైతు బీమా ఇస్తాం
- అడవులను రక్షించాల్సిన బాధ్యత వారిదే
- చెట్టు కొడితే హక్కు పత్రాలు వెనక్కి...
- భూమిలేని ఎస్టీలకు గిరిజన బంధు : అసెంబ్లీలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోడు భూముల పంపిణీని ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. 11.5 లక్షల ఎకరాల భూముల్ని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పోడు పత్రాలతో పాటు వారికి రైతుబంధు, రైతుబీమా వర్తింప చేస్తామన్నారు. నీరు, కరెంటు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. అయితే అడవుల పరిరక్షణను పోడు రైతులే తీసుకోవాలనీ, ఏ ఒక్క చెట్టు కొట్టినా, ఇచ్చిన పత్రాలను వెనక్కి తీసేసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించి పలు షరతులు విధిస్తున్నట్టు చెప్పారు. భూమిలేని పేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామన్నారు.
ఏజెన్సీలో సర్పంచి, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ, ఆదివాసీల ప్రతినిధులు సంతకాలు పెడితేనే గిరిజనులకు పోడుభూములను పంచుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. అలా చేయని గ్రామాల్లో పట్టాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూములపై తాము ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ఓట్ల కోసం రాజకీయం చేయబోమనీ, తాము సైతం అడవి బిడ్డల సంక్షేమానికే పాటుపడతామని అన్నారు. అదే సందర్భంలో అడవులను నరికితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్ఛరిం చారు. చత్తీస్ఘడ్ నుంచి గుత్తికోయలను తెచ్చి చెట్లు నరికిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని సహించబోమన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని వివరించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పోడుభూములపై సీఎం ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని తెలిపారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామనీ, అటవీ అధికారులపై దాడులు సరికాదనీ అన్నారు. గిరిజనులకు గత పాలకులు ఎన్నికల కోసం చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. మేము అలా చేయమని అన్నారు. పోడుభూములపై ప్రతిసారి రాజకీయం చేయడం సరికాదంటూ, పోడు భూములు అనేవి హక్కు కాదు..ఆక్రమణ.. దురాక్రమణ అని వ్యాఖ్యానించారు. విచక్షణారహితంగా అడవులను నరకడం ఏంటి ? పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం, జెండాలు పట్టుకోవడం, మంత్రి వస్తే ధర్నా, ఎమ్మెల్యే వస్తే ధర్నా ఏంటి ఇదంతా ? అని ప్రశ్నించారు. అలాగే గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా కూడా చూస్తామని చెప్పారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లి చేసుకుని, భూములను ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను ఈ తరహాలో కబ్జాచేశారన్నారు. భద్రాచలంలోనూ ఇది జరుగుతున్నదన్నారు. 10 నుంచి 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేననీ, అందులో ఎలాంటి సందేహం లేదనీ, పోడుభూముల దురాక్రమణ జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా ? కనుమరుగు కావాలా ? అని ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. గతంలో సినిమా షూటింగులతో ఆ అడవి కళకళలాడుతూ ఉండేదని గుర్తు చేశారు. అడవుల పునరజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని సీఎం వివరించారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్కవరేజీ పెరిగిందనే ప్రశంసలు వస్తున్నాయని సభకు తెలియజేశారు. కమ్యూనిస్టు మిత్రులు, భట్టి విక్రమార్కకు కూడా పోడు భూముల గురించి చెప్పానని అన్నారు. ఈ భూముల విషయంలో తమకు స్పష్టత ఉందనీ, వాటిపై సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్ కనెక్షన్ ఇస్తామనీ, సాగునీటి సౌకర్యం సైతం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు సాగుచేసుకుంటున్న వారికే పట్టాలు ఇస్తామని వెల్లడించారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి ఆ భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని చెప్పారు. తీర్మానానికి ముందుకురాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదన్నారు. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదనీ, పట్టాలను రద్దుచేస్తామని హెచ్చరించారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని ఆదేశించారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమన్నారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని చెప్పారు. అడవిని నరికేసి భూములు ఇవ్వాలని అడగడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని చెప్పారు. అడవుల నరికివేతకు ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్ పడాలని అన్నారు. గజం అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దనీ, ఆక్రమణను సర్కార్ సహించదని తెలిపారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొడుకును పోడు భూముల వివాదంలో పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎస్టీల జాబితాలోకి మరిన్ని కులాలు :అసెంబ్లీ తీర్మానం
వాల్మీకి బోయలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయీతి లంబాడ, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీల జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2016లోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇంతవరకూ స్పందన రాలేదని సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.