Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చాలని ఉద్యమాలు జరిగాయని, కేంద్రం వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. వాల్మీకి బోయల గురించి సమగ్రంగా ఆలోచించిన సీఎం కేసీఆర్ వారిని ఎస్టీలోకి చేర్చుతూ అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రులు మాట్లాడారు. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీలుగా చేర్చాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక చెల్లప్ప కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీలో కలుపుతూ తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపించామని తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని 1956 నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారన్నారు. ఎంతో మేధస్సు ఉన్న ఈ జాతి ఎన్నో ఏండ్లుగా నష్టపోయిందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం వారిని ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఆమోదించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో తనకు భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
ఎమ్మెల్యే రెడ్యానాయక్
హైదరాబాద్‌లో తనకు భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే రెడ్యానాయక్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రియ, శంకర్ నాయక్‌తో కలిసి రెడ్యానాయక్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో భూముల కోసం పార్టీ మారారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను రెడ్యానాయక్ తీవ్రంగా ఖండించారు. తనకుగాని, తన కూతురుకుగాని హైదరాబాద్‌లో సెంట్ భూమి కూడా లేదన్నారు. హైదరాబాద్‌లో సర్వే నెంబర్ 80లో ఉన్న 5 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి తాను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరానని రేవంత్‌రెడ్డి ఆరోపించారని, ఇది అబద్ధమన్నారు. గతంలో కొంత భూమి ఉండగా దానిని విక్రయించామని స్పష్టం చేశారు. గతంలోనూ ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, అందుకే మేము బీఅరెస్లో చేరామని చెప్పారు రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు, బ్లాక్ మెయిలర్, భూ కబ్జాదారుడని ఎమ్మెల్యేలు విమర్శించారు. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుకున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక రెండు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ పేల్చాలని రేవంత్ అంటే.. తాజాగా బండి సంజరు సెక్రటేరియట్‌ను కూల్చేస్తా అంటున్నారని.. ఈ రెండు జాతీయ పార్టీల నాయకులకు పిచ్చి పట్టిందని విమర్శించారు.
ఆ నాయకులకు మతిభ్రమించింది
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
రాష్ట్రంలోని జాతీయ పార్టీల నాయకులకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తుంటే వీళ్లు టెర్రరిస్టులాగా మాట్లాడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన భవనాలు, ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒకరు కూలుస్తా అని.. మరొకరు పేలుస్తా అంటున్నారని, కానీ, ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని కూల్చివేశారని అన్నారు. టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ క్రిమినల్ సెంటర్ అయిందని, కాంగ్రెస్ పార్టీని అహింసావాదం నుంచి హింసా వాదానికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలవి పాదయాత్రలు కావు.. అంతిమయాత్రలని చెప్పారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉండాల్సిన వాళ్లు పార్టీల అధ్యక్షులు అయ్యారని విమర్శించారు.