Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే తగ్గిన 1.80 లక్షల మంది
- మన ఊరు-మనబడి, ఆంగ్ల మాధ్యమంతో ప్రయోజనం అంతంతే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో గతేడాది కంటే 1,80,697 మంది తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 27,99,719 మంది చేరితే 2021-22 విద్యాసంవత్సరంలో 30,78,189 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అంటే సర్కారు బడుల్లో 2,78,470 మంది అధికంగా చేరడం గమనార్హం. అప్పుడు కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 28,97,492 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అంటే గత విద్యాసంవత్సరం కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో 1,80,697 మంది విద్యార్థులు తగ్గారు. ప్రయివేటు పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో 32,52,588 మంది, 2021-22 విద్యాసంవత్సరంలో 28,67,895 మంది విద్యార్థులు చేరారు. గత విద్యాసంవత్సరంలో ప్రయివేటు బడుల్లో 3,84,693 మంది విద్యార్థులు తగ్గారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30,58,634 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అంటే గత విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల్లో 1,90,739 మంది విద్యార్థులు అధికంగా చేరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టింది.
మొదటి దశలో 9,123 బడుల్లో రూ.3,497 కోట్లతో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. ఇంకోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. గత విద్యాసంవత్సరంలో 30,154 ప్రభుత్వ, 11,238 ప్రయివేటు కలిపి మొత్తం 41,392 పాఠశాలల్లో 59,46,084 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30,203 ప్రభుత్వ, 11,067 ప్రయివేటు కలిపి మొత్తం 41,270 బడుల్లో 59,56,126 మంది విద్యార్థులు చదువుతున్నారు.