Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఈటల స్పష్టీకరణ
- సింగరేణిపై కేంద్రాన్ని నిలదీయండి : కేటీఆర్
- దేశీయ బొగ్గును కొనొద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పది బొగ్గు గనుల కేటాయింపు కోసం సింగరేణి దరఖాస్తు చేసుకున్నా... కేంద్రం కేటాయించలేదని నిరూపిస్తే తాను బీజేపీలో ఉండబోనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిలో బ్లాకులు కేటాయించిన కేంద్రం సింగరేణికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సింగరేణిపై ప్రేమ కురిపిస్తే సరిపోదనీ, ఆ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని ఈటలకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన కోల్‌మైన్స్ కోసం రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చనీ, ఒక పద్ధతిలో 14 శాతం ఆదాయం వారికివ్వాల్సి ఉంటుందనీ, ఓపెన్ టెండర్లో అయితే 4 శాతం మాత్రమే ఇచ్చే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది ఆ పద్ధతినే ఎంచుకుంటున్నారని తెలిపారు. ఓపెన్ కాస్ట్‌కు వీలుపడని వాటికి అండర్‌గ్రౌండ్ మైనింగ్ దిశగా ఎందుకు అడుగులు వేయకూడదని ప్రశ్నించారు. సింగరేణికి ఉన్న రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణిని ప్రయివేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ఈ సమయంలో కల్పించుకున్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, విదేశాల నుంచే బొగ్గు దిగుమతి చేసుకోవాలనీ, దేశీయ బొగ్గు కొనొద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పని చేస్తున్నదనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొంత మంది దోస్తుల కోసమే విదేశీ బొగ్గును అధిక ధరకు కొనాలని ప్రధాని మోడీ చెబుతున్నారని తెలిపారు. కోల్ ఇండియా కన్నా సింగరేణి మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుకు కట్టబెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే గనులు కేటాయించకుండా నష్టాల పాలు చేసిందనీ, సింగరేణిని కూడా అదే తరహాలో నష్టాల పాలు చేసి ప్రయివేటుకు అప్పగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతకు ముందు ఈటల గెస్ట్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గెస్ట్ టీచర్లకు 12 నెలల జీతమిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఉస్మానియా యూనివర్సిటీలో సంపూర్ణ భోజన సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాకెట్ మనీ ఇవ్వాలనీ, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అడ్డుతగిలారు. యూపీఏ హయాంలో ఇచ్చిన రాజీవ్ గాంధీ ఫెల్లోషిప్‌ను బీజేపీ రద్దు చేసిందనీ, రాష్ట్ర విభజన హామీలైన గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ రద్దు చేసిందనీ, నిటిఅయోగ్ సిఫారసు చేసిన వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు నిధులివ్వలేదని తెలిపారు. వాటిపై మాట్లాడాలని సుమన్ ఈటలకు సూచించారు. దీంతో ఈటల తాను బీజేపీలో ఉన్నప్పటికీ.... అన్యాయం జరిగితే తప్పకుండా అక్కడా అడుగుతానని తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తాం...
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలలినిచ్చే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చాలా జిల్లాల్లో ఇప్పటికే ఇండ్ల స్థలాలిచ్చామనీ, మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఐఅండ్ పీఆర్ పద్దుపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు, బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ జర్నలిస్టుల సంక్షేమంపై లేవనెత్తిన అంశాలకు కేటీఆర్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య తనిచ్చిందని తెలిపారు. జర్నలిస్టుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామనీ, 16 వేల అక్రిడియేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెల రూ.3 వేల పెన్షన్, ఇద్దరు పిల్లలకు చెరో రూ.1,000 చొప్పున, ఉన్నత విద్యకైతే రూ.ఒక లక్ష, విదేశాలకు వెళ్లే పిల్లలకు రూ.ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్పారు. కోవిడ్-19లో జర్నలిస్టులకు రూ.6.88 కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని తెలిపారు. చాలా జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చామనీ, ఇంకా ఎక్కడైనా ఇవ్వకపోతే అక్కడ కూడా ఇస్తామని స్పష్టం చేశారు..
చేనేతకు పన్ను వేసిన తొలి పీఎం మోడీ
'ప్రధాని మోడీ కంటే ముందు దేశాన్ని 14 మంది ప్రధానమంత్రులు పాలించారు. ఏ ఒక్కరు చేనేత కార్మికులపై పన్ను విధించలేదు. వారిపై ఐదు శాతం పన్ను విధించిన తొలి పీఎం మోడీయేనని' మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈటల మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి సకాలంలో చెల్లింపులు చేసి ఆదుకోవాలని కోరారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ చేనేత సంక్షేమానికి సంబంధించిన అనేక బోర్డులను కేంద్రం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పచ్చని రాష్ట్రాన్ని పిచ్చోళ్ల చేతికి అప్పగించొద్దు
పచ్చని రాష్ట్రాన్ని పిచ్చోళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించొద్దని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కోరారు. . ప్రగతిభవన్‌ను పేల్చేస్తామని, సచివాల యాన్ని కూల్చేస్తామంటూ అరాచక శక్తులు మాట్లాడుతున్నాయనీ, అలాంటి వారి పట్ల అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న పార్టీల కు నిర్మాణాత్మక వైఖరి లేదని విమ ర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కోసం చేసిన చర్యలను ఛాయాచిత్రాలతో వివరించారు. చర్చలో ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ సభ్యులు నన్నపనేని నరేందర్, గణేష్ గుప్తా, సతీష్ పాల్గొన్నారు.