Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో కేంద్రంపై కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వరంగ సంస్థల్ని పరిరక్షిస్తూ, రాష్ట్రంలో కొత్త స్టార్టప్‌లకు తాము ప్రాధాన్యం ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం 163 ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్ముతూ ప్యాకప్ చెప్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమ్మే 163 సంస్థల్లో 9,19,479 మంది ఉద్యోగులు ఉన్నారనీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం దీనిలో ఉద్యోగాలు సాధించిన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కడుపులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్ని కేంద్రంలోని ఇద్దరు వ్యక్తులు అమ్ముతుంటే, మరో ఇద్దరు కొంటున్నారనీ, వారెవరో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్ని కొన్న కార్పొరేట్లు ఆరు నెలలు తిరక్కుండానే, నష్టాల పేరుతో కేంద్రానికి లేఖలు రాస్తే, వారు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నారని చెప్పారు. ఇలా ఇప్పటి వరకు కేంద్రం కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసిందని వివరించారు.
శత్రుదేశంపై ఆంక్షలు విధించినట్టే...
కేంద్ర చెప్పినట్టు ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మకుంటే, శత్రుదేశంపై ఆంక్షలు విధించినట్టే రాష్ట్ర ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ, మెడపై కత్తి వేలాడదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పారిశ్రామికాభివృద్ధికి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారనీ, దానివల్ల ఎవరు లబ్దిపొందారని ప్రశ్నించారు. కేంద్రానికి దుమ్ముంటే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారంనాడాయన శాసనసభలో పారిశ్రామిక బిల్లును ప్రవేశపెడుతూ మాట్లాడారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌గా ఆయన్ని ఉద్దేశించే మంత్రి మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వెన్నుముక లేని నలుగురు ఎంపీలు ఉన్నారనీ, రాష్ట్రానికి ఏం కావాలో అడిగే దమ్ము, ధైర్యం వారికి లేవన్నారు. ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బీరాలు పలికిన ఎంపీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న మరో ఎంపీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ తెచ్చే సత్తా వారికి లేదని చెప్పారు. 8 ఏండ్లలో 141 పురపాలికల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15,090 కోట్లు ఖర్చు చేసి, అభివృద్ధి పనులు చేపట్టిందనీ, వీటికి కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం రూ.1,690 కోట్లు (10శాతం) మాత్రమేనని అన్నారు.
ప్రజలు బాధ్యతగా ఉండాలి
పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ శాఖ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి మంది జనాభా ఉంటే, పారిశుద్ధ్య కార్మికులు 20వేల మంది మాత్రమే ఉన్నారనీ, ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనేక శాఖలకు అవార్డులు ఇస్తుందే తప్ప, నిధులు మాత్రం ఇవ్వట్లేదని విమర్శించారు. .
రూ.77వేల కోట్ల పెట్టుబడులు
కేవలం ఐటీరంగంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు రూ.77వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.3.32 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు.
ప్రతివారం ఏదో ఒక పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నదని అన్నారు.