Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, ఫెడరలిజంపై కేంద్రం దాడి
- త్రిపురలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి
- ఆర్థిక మాంద్యంతో పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
- సమస్యలపై ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
దేశంలో వచ్చే ఏడాదిలో నిర్వహించబోయే పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించడమే తమ లక్ష్యమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంహెచ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక విదేశీ కుట్ర అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. ఈ అబద్ధాల ప్రచారం మరింత పెరుగుతోందన్నారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు మతోన్మాద ఎజెండాను, కులవిభజనను ముందుకు తెస్తున్నదని అన్నారు. ఎన్నికల వరకు ఇలాంటివి మరింత ఉధృతమవుతాయని చెప్పారు. దీంతోపాటు న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం వద్దనీ, కేంద్రమే ఎంపిక చేసే విధానం కావాలంటూ కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థను లొంగదీసుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని చెప్పారు. గవర్నర్లను ఉపయోగించుకుని రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తున్నదని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని విమర్శించారు. కేరళలో సహకార వ్యవస్థ పటిష్టంగా అమలవుతున్నదని వివరించారు. దీన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్ని స్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ చరిత్రను వక్రీకరించేలా యూజీసీ నిబంధనలను మారుస్తున్నదని చెప్పారు. సామాజిక, సాంస్కృతిక అంశాల్లోకి మతోన్మాదాన్ని తెచ్చి ప్రజలను విభజిస్తున్నదని విమర్శించారు. ఏటా ఒక దేశం నిర్వహించే జి-20 సదస్సుకు ఇప్పుడు భారత ప్రభుత్వానికి అవకాశమొచ్చిందని అన్నారు. దానిపై బీజేపీ గొప్పలు చెప్తున్నదని చెప్పారు. మానవాభివృద్ధి సూచికలో గుజరాత్ వెనుకబడి ఉందనీ, దారిద్య్రం ఎక్కువుందని వివరించారు. మతోన్మాద భావజాలాన్ని పెంచి అక్కడ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఓడి పోయిందని చెప్పారు. త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాల యాలు, కార్యకర్తలపై బీజేపీ గూండాలు దాడులు చేస్తున్నా రని అన్నారు. నిర్బంధకాండను ప్రయోగిస్తున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. అక్కడ ప్రజాస్వామిక వాతావరణం లేదన్నారు. ఆ రాష్ట్రంలో శాంతియుతంగా, స్వేచ్ఛగా ఎన్ని కలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రెండేండ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ఆర్థిక వృద్ధి తగ్గుతుందంటూ ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు చెప్తున్నాయని వివరించారు. ధరలు తగ్గడం లేదనీ, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందని అన్నారు. సరుకుల ఉత్పత్తి తగ్గుతోందనీ, ఉద్యోగాల్లో కోత పడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఉద్యమాలు పెరుగుతాయన్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో పెద్ద సమ్మెలు జరిగాయని గుర్తు చేశారు.
22 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు
సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను దేశవ్యాప్తంగా నిర్మిస్తామని రాఘవులు ఈ సందర్భంగా అన్నారు. ఈనెల 22 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఉపాధి కల్పించే మౌలిక సదుపాయాలను ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఐదు కిలోల బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచాలనీ, పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధనవంతులపై పన్ను వేయాలనీ, వారసత్వ పన్ను విధించాలని కోరారు. సంపన్నులకు రూ.35 వేల కోట్ల రాయితీలను రద్దు చేయాలని చెప్పారు. ఏప్రిల్ ఐదో తేదీన రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు వేరు, ప్రజాసమస్యలపై ఉద్యమాలు వేరని స్పష్టం చేశారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్ సుధాభాస్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీజీఎం పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.