Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ
- కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నకేంద్ర సర్కారు
- వ్యవసాయ పరిరక్షణకు ఉద్యమాలు
- కార్మిక- కర్షక సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. దీనిని నిరసిస్తూ ఏప్రిల్ 5 చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్దన్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన 'కార్మిక- కర్షక' సదస్సులో సుదర్శన్ ప్రసంగించారు.
జీ20 దేశాల కూటమి సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం భారతదేశానికి లభించడం గర్వకారణమని మోడీ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆకలి సూచీలో దేశం ప్రపంచంలోనే 107 స్థానంలో ఉన్నందుకు గర్వపడాలా? అని ప్రశ్నించారు. దేశంలో 23 కోట్ల మంది పేదరికంలో అల్లాడుతున్నారని కేంద్రం లెక్కలే చెబుతున్నాయి.. ఇందుకు గర్వపడాలా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంతో భారతదేశంలో ప్రతి అరగంటకు ఓ రైతు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధిహామీ, వ్యవసాయ రంగాలకు ఏటేటా ప్రభుత్వం కేటాయింపులు తగ్గిస్తోందన్నారు. కార్మిక హక్కులనూ కాలరాస్తోందన్నారు. కార్మిక హక్కుల స్థానంలో నాలుగు కోడ్లను తీసుకొచ్చారని, వాస్తవానికి అవి కార్మిక కోడ్లు కాదు.. కంపెనీ కోడ్లని చెప్పారు. వీటన్నింటిపై సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. దీనికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ఢిల్లీలో ఆందోళన నిర్వహించేందుకు కారణమైన పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. వ్యవసాయరంగం, ఉపాధిహామీ, ఆశావర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చే కేటాయింపుల్ల్లో కోతలు విధిస్తున్న కేంద్రం.. కార్పొరేట్లకు మాత్రం రూ.19.50 లక్షల కోట్లు రాయితీ ఇస్తోందన్నారు. రైతుసంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా కార్మిక- కర్షకులను ఐక్యం చేయాలన్నారు. డబుల్ ఇంజిన్ బుల్డోజర్ బయలుదేరింది.. అన్నింటినీ ధ్వంసం చేస్తోంది.. మనకెందుకులే అనుకుంటే మొత్తం దేశాన్నే ధ్వంసం చేస్తుందని చెప్పారు. ఇప్పటికే దేశం రూ.1.37 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.
14 మంది ప్రధానులు రూ.50వేల కోట్ల అప్పులు చేస్తే.. ఒక్క మోడీ సర్కారే ఈ ఎనిమిదేండ్లలో రూ.87వేల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. అదానీపై వచ్చిన ఆరోపణలను దేశంపై దాడిగా బీజేపీ చిత్రీకరించడం.. కార్పొరేట్ల పట్ల ఆ పార్టీకున్న ప్రేమకు నిదర్శనమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేసేందుకు నెలకొల్పిన సీసీఐ, మార్క్ఫెడ్ వంటి కార్పొరేషన్లను సైతం ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, బంతు రాంబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్, నాయకులు యర్రా శ్రీను, పిన్నింటి రమ్య, గద్దల రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.