Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ ఎడమకాల్వ చివరి భూములకు అందని సాగునీరు
- ఆందోళన చెందుతున్న రైతులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
వేసవి ప్రభావం అప్పుడే పంట పొలాలపై పడింది.. అయితే.. బోరు బావుల్లో నీరున్నా.. కాల్వల ద్వారా నీరు వస్తున్నా కరెంట్ కోతలు.. రాత్రి వేళల్లో కరెంట్ ట్రిప్ అవడంతో మరమ్మతులు లేక పొలాలకు నీరు పారడం లేదు. సాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ల కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. చివరి వరకు నీరు రాకపోవడంతో వరి పొలాలు ఎండుతున్నాయి. పొట్ట దశలోకి వచ్చిన వరి పంట పొలాలు నీరు అందకపోవడంతో ఆ పొలాలు బీడుగా మారుతున్నాయి. డిజైన్ కంటే అధికంగా సాగునీరు విడుదల చేస్తున్నప్పటికీ చివరి భూములకు నీరు అందడం లేదు. ప్రధానంగా రాత్రి వేళలో కరెంటు సరఫరా చేయడం.. అర్ధరాత్రి సమయంలో కరెంట్ ట్రిప్ కావడంతో చివరి భూములకు నీరు అందడం లేదని రైతుల పేర్కొంటున్నారు. మెట్ట పంటలు వేయాల్సిన భూముల్లో కూడా వరి సాగు చేయడం వల్ల పంట విస్తీర్ణం పెరిగి నీటి వినియోగం సరిపోవడం లేదని అధికారులు అంటున్నారు. కాలువ లైనింగ్ పనులు పూర్తిగా ఆధునీకరించామని.. మేజర్లు, మైనర్ల మరమ్మతులు చేశామని.. చివరి భూములకు కూడా నీరు అందుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. అది వాస్తవ రూపం దాల్చడం లేదు.
సాగర్ ఎడమకాల పరిధిలో పలు మేజర్లు ఉన్నాయి. వీటి పరిధిలో ముల్కల కాల్వ, కిష్టాపురం, వజిరాబాద్, ముక్తల్ బ్రాంచ్ కాల్వలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 80 వేల ఎకరాల వరి పంట సాగు అవుతుంది. సుమారు 20శాతం అంటే 16 వేల ఎకరాలు కాల్వ చివరి భూములుగా ఉన్నాయి. ఈ భూములకు సాగు నీరు అందటం లేదు. ఒక్కొక్క మేజరుకు 170 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిజైన్ చేసినప్పటికీ.. దానికి 200 నుంచి 220 క్యూసెక్కుల వరకు విడుదల చేస్తున్నారు. అయినా చివర భూముల వరకు నీరు పారటం లేదు. వరి పొలాలకు నీరు అందక పొట్ట దశలోనే ఎండిపోయి బీడులుగా మారుతున్నాయి.
సరఫరా కానీ 24 గంటల కరెంట్
వ్యవసాయానికి నిరంతరం విద్యుత్తు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి నిరంతరం కరెంటు అందడం లేదు. వ్యవసాయానికి రాత్రి వేళలో కరెంట్ ఇవ్వడం వల్ల అర్ధరాత్రి సమయాల్లో ట్రిప్ అవుతుంది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు కరెంటు అందిస్తున్నారు. ఆ సమయంలోనే మోటార్ల ద్వారా సాగునీటిని పంట పొలాలకు మళ్లించుకుంటున్నారు. రాత్రి వేళలో కరెంట్ ట్రిప్ కావడం వల్ల మరమ్మతులు చేసే వారు లేకపోవడంతో ఆ భూములకు నీరు అందడం లేదు. గ్రామాల్లో ఉన్న మెకానిక్ల ద్వారా మోటార్లు రిపేరు చేయించుకోవడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా ఒకటి రెండ్రోజుల పాటు నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే తరహాలో కాలువ చివర భూముల రైతుల పరిస్థితి ఉంది.
పగటిపూట కరెంట్ ఇవ్వాలి..
రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల మధ్యలో ట్రిప్ అవుతుంది. పొలాలకు ఒకేసారి కరెంట్ ఇవ్వడంతో లోడ్ పెరిగి మోటార్లు కాలిపోతున్నాయి. ఈ మోటర్లు రిపేరు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఆలోపు పొలాలకు నిరందక ఎండిపోతున్నాయి. రాత్రి వేళలో కాకుండా పగటి వేళలో కరెంటు ఇవ్వాలి.
- భాస్కర్- రాయినిపాలెం
చివరి భూముల రైతులను ఆదుకోవాలి
మేజర్ల పరిధిలో ఉన్న కాలువ చివరి భూములకు నీరు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. డిజైన్ ప్రకారం నీటిని విడుదల చేస్తున్నా చివరి భూముల వరకు నీరు అందడం లేదు. ప్రధానంగా రాత్రి వేళలో కరెంటు ఇవ్వడం వల్ల రైతులందరూ ఆ సమయంలోనే నీటిని తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. కాల్వ చివరి వరకు నీరు పారడం లేదు. చివరి భూముల వరకు నీరందించి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తాం.
- రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి
నీటిని పొదుపుగా వాడుకోవాలి
సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా మేజర్ల పరిధిలోనే ఉన్న చివరి భూముల రైతులకు సాగునీరు అదేవిధంగా పైన ఉన్న రైతులు సహకరించాలి. నీరు కింది వరకు పారే విధంగా రైతులు చూడాలి. వరి పంట సాగు విస్తీర్ణం పెరగడం వల్ల చివరి భూములకు నీరందడం కష్టంగా మారింది. అయినప్పటికీ డిజైన్ కంటే అదనంగా సాగునీటిని విడుదల చేస్తున్నాం.
- ఎన్నెస్పీ డీఈ బుచ్చిబాబు