Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా బలమైన శాంతి ఉద్యమాలు రావాలి
- ఐప్సో రాష్ట్ర మూడో మహాసభలో వక్తలు
- అసమానతలు, మతోన్మాదంపై పోరాడదాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశానికి ప్రమాదంగా మారుతున్న ఆరెస్సెస్ విస్తరణను అడ్డుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అశాంతికరమైన పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనదేశంలో కూడా బలమైన శాంతి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. సామ్రాజ్యవాద విధానాలను ఎదుర్కొని, ఆనాడు రష్యా నిలబడిందని గుర్తు చేశారు. అమెరికా దేశం పెట్టుబడిదారీ వ్యవస్థలకు నేతృత్వం వహిస్తూ...అనేక దేశాల్లో యుద్ధ పరిస్థితులను సృష్టిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, నాటో కూటమి ఉక్రెయిన్ దేశంలో స్థావరాలు ఏర్పరచుకుని రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మనదేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులను రెచ్చగొట్టి బీజేపీ లబ్దిపొందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత శాంతి సంఘిభావ సంఘం ( ఐప్సో) రాష్ట్ర మూడో మహాసభను శనివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐస్పో జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కె యాదవరెడ్డి జెండావిష్కరణ చేశారు. అనంతరం ప్రారంభమైన సభలో జనరల్ సెక్రటరీ జి నాగేశ్వరరావు ప్రజాఉద్యమాల్లో మరణించిన నేతలకు, ఉగ్రవాద చర్యలకు బలైన వారికి, ఇటీవల మరణించిన సినీనటులకు, భూకంప ప్రమాదంలో మరణించిన వారికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఐప్సో డిప్యూటీ జనరల్ సెక్రటరీ హరిచంద్ సింగ్ భట్ మహాసభలను ప్రారంభిస్తూ...సారూప్యత కలిగిన నేతలతో ఐస్పో ఏర్పడిందని గుర్తు చేశారు.ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం అది అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజలపై హింసకు వ్యతిరేకంగా, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అంతర్జాతీయంగా శాంతి ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
జీ20 సమ్మిట్‌లో దేశంలోని సమస్యలపై చర్చించాలి: ఆర్ ఆరుణ్‌కుమార్
ప్రధాని మోడీ జీ20 సమ్మిట్ ఇంతవరకు ఎక్కడా జరగలేదు, ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఐప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఇతర దేశాలతో పోల్చి,మనదేశంలో నిరుద్యోగం, ఆరోగ్య వ్యవస్థ, కరోనా సమయంలో ఏయే దేశాల్లో ఎంత మంది మరణించారనే అంశాలపై జీ20 సమ్మిట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే అంశంపై చర్చించడంపై తమకు ఎలాటి అభ్యంతరం లేదనీ, అయితే వాటిని ఆచరించాలని మోడీకి సూచించారు. భారత వసుదైక కుటుంబం, తాత్విక చింతన చాలా గొప్పదనీ, అయితే వాటన్నింటని అమలు చేసే దమ్ము కేంద్రానికి ఉందా? అని ప్రశ్నించారు. సమ్మిట్‌లో వివిధ అంశాలపై చర్చించేందుకు 30 వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం నియమించిందనీ, అందులో సభ్యదేశాలకు సంబంధించిన వంటకాలను పరిచయం చేస్తున్నారని తెలిపారు. వాటిని తాజ్, మెరిడియన్, ఒబేరారు వంటి హోటళ్లలో సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఆ వంటకాలను సాధారణ ప్రజలు ఆస్వాదించగలరా? అని ప్రశ్నించారు. మైకేల్ రాబర్ట్ చెప్పిన దాని ప్రకారం అమెరికా, బ్రెజిల్ దేశాలు కరోనా విషయంలో చైనా పద్దతిని అవలంభించకపోవడంతో 10 లక్షల మంది మరణించారని పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షులు బైడెన్ 108 బిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రిని పంపుతున్నారనీ, అందుకే యుద్ధం కొనసాగుతున్నదని వివరించారు. ఆయా దేశాల్లో యుద్ధ పరిస్థితులను సృష్టించేందుకు అమెరికా కంపెనీలు 700 మంది దళారుల్ని నియమించాయని తెలిపారు. కరోనా సమయంలో అమెరికా కంపెనీలకు రోజుకు రూ. 22,27,360 లక్షల చొప్పున ఆదాయం పెరిగిందనీ, ఇది గంటకు రూ 928 కోట్లుగా నమోదైందని పేర్కొన్నారు. అందులో ఒక శాతం ఖర్చు చేసినా అనేక దేశాల్లో పేదల ఆకలి తీరుతుందన్నారు. యుద్ధాలు అంతమవ్వాలంటే, వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అసమానతలు, మతోన్మాదం, మహిళలపై వేధింపులు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. అంతేకాకుండా మనకు ఆర్ఎస్ఎస్ ప్రధాన శత్రువు అనీ, దాని విస్తరణకు అడ్డంగా నిలబడాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థుల్లోకి ఐప్సోను తీసుకెళ్లాలనీ,తద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలని సూచించారు. యువత సినిమాల్లోని యుద్ధ సన్నివేశాలకు ఆకర్షితులు అవుతున్నారనీ, దాని స్థానంలో శాంతి ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులుగా...ఇక్కడి ప్రజల సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సంస్కృతికి ప్రతీకలైన గుమ్మటాలను కూల్చుతామనే ప్రకటనలను ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రజల మానసిక స్థితిని మార్చేందుకు ఎన్నో కుట్రలు : వినోద్‌కుమార్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మానసిక స్ధితిని మార్చేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నదని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠికను మారుస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష భావాల ప్రభావంతోనే రాజ్యాంగంలో లౌకికవాదం, సోషలిజం పదాలను చేర్చారనీ, వాటిని తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఎంత మంది పండితులు మరణించారో లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.
దేశంలో అంతర్గత శాంతి కావాలి : పల్లా
మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో అంతర్గత అశాంతి నెలకొందని సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. అందువల్ల రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో బీజేపీ అసహనాన్ని సృష్టించి ఓట్లు దండుకుందని గుర్తు చేశారు. ఎక్కడ యుద్ధం వచ్చినా అమెరికా ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ఆ సందర్భంగా ఆయుధాలు అమ్ముకుని లాభాలు గడిస్తున్నారని చెప్పారు.
చట్టసభలు తిట్ల సభలుగా మారాయి : జూలకంటి
అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలు తిట్ల సభలుగా మారాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. చట్టసభల్లోనూ దేశంలోని శాంతి పరిస్థితులపై చర్చించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మీడియా యద్ధ పరిస్థితులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలంటే కర్రలు, తుపాకులతో కాకుండా అత్యాధునిక ఆయుధాలు, అణ్వాయుధాలతో చేసేందుకు సిద్ధమయ్యారనీ, ఇది ఆందోళన పరిస్థితులకు దారి తీసుకుందని హెచ్చరించారు. 1991 తర్వాత వివిధ దేశాల్లో జరిగిన యుద్ధాల్లో 9 కోట్ల మంది ప్రజలు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం నశించి, తుపాకి కల్చర్ వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ సర్కారు రైతు, కార్మిక, కూలీల వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు.
జాతీయ స్థాయి శాంతి సదస్సు నిర్వహించాలి : కాచం
తెలంగాణలో సీఎం కేసీఆర్ సహకారంతో జాతీయ స్థాయి శాంతి సదస్సు నిర్వహించాలని ఐప్సో మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మెన్ కాచం సత్యనారాయణ కోరారు. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా శాంతి స్థాపన కోసం పోరాటం చేస్తామన్నారు. దేశంలో అశాంతి నెలకొందనీ, అందుకే శాంతి కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐప్సో నేతలు ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, జి రఘుపాల్, తిప్పర్తి యాదయ్య, మెట్ల జగన్, ఒబేదుల్లా కొత్వాల్, జగన్‌మెహన్, కేవీఎల్ తదితరులు మాట్లాడారు. అనంతరం పలు అంశాలపై మహాసభ తీర్మానాలను ఆమోదించింది.