Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని కూల్చడానికి నీవు ఎవరివంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టీఆర్ఎస్ వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరురి రమేష్ ప్రశ్నించారు. దమ్ముంటే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవికుమార్, ఎమ్మెల్యే చిన్నయ్యతో కలిసి రమేష్ మాట్లాడారు. ''మీరు దేశంలో మతకల్లోలాలు సృష్టించి, అమాయకులను ఇబ్బందులకు గురిచేసినా మేము ఏమనడం లేదని రెచ్చిపోతున్నావా.. ఖబడ్దార్ సంజయ్'' అంటూ హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయంపై అమర్చిన గుమ్మటాలను కూల్చేస్తామని బండి సంజయ్ మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సెక్రటేరియట్‌ను బద్దలు కొడతాం అనడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సైతం ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామంటున్నారని, సంజరు సచివాలయాన్ని కూల్చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ పిచ్చోళ్లుగా, సైకో ల్లాగా మాట్లాడుతున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణను ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి రూపాయి సహాయం చేయకపోయినా ప్రత్యేక నిధులు సమీకరించి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు.
బండి సంజరు ముక్కు నేలకు రాయాలి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవికుమార్
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చెంపలేసుకుని, ముక్కు నేలకు రాస్తే తప్ప ఊరుకునే ప్రసక్తే లేదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవికుమార్ హెచ్చరించారు. సెక్రటేరియట్ ప్రభుత్వ, ప్రజల ఆస్తి అన్నారు. ప్రజలు బండి సంజయ్‌కి బుద్ధి చెప్పాలన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రగతిభవన్‌లో ఉంటారన్నారు. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదని, రాష్ట్రంలో సైతం కనుమరుగవుతుందన్నారు. ఆ ప్రెస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిని, బండి సంజయ్‌ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. మీ మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజానీకానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.