Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది జనవరి నాటికి ఆర్టీఏకు రూ.5,304 కోట్ల ఇన్కమ్
- మార్చి నాటికి మరో వెయ్యి కోట్లతో రూ.6,350 కోట్ల రాబడి అంచనా
- గతేడాది మొత్తం రూ.3,971 కోట్లు ఆర్జించిన రవాణాశాఖ
- లైఫ్, క్వార్టర్లీ, గ్రీన్‌ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పెరిగిన ఆదాయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖ వార్షిక ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో దాదాపు రెండింతల ఆదాయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్ ట్యాక్స్(జీవితకాలపు పన్ను)తోపాటు క్వార్టర్లీ, గ్రీన్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా వసూలయ్యే పన్నుల్లో భారీ వృద్ధి నమోదైంది. దాదాపు పదేండ్ల తర్వాత గతేడాది మే నెలలో ఒక్కొక్క సర్వీస్‌కు సంబంధించిన పన్నులను రవాణాశాఖ సవరిస్తూ వచ్చింది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పన్నుల ద్వారా రవాణాశాఖ రూ.5304 కోట్లు రాబడి సాధించి రికార్డుకెక్కింది. మార్చి నాటికి మరో రూ.1063 కోట్ల ఆదాయం రానుందని.. మొత్తం రూ.6,367 కోట్లు ఆదాయం రావచ్చునని ఆర్టీఏ ఉన్నతాధికారుల అంచనా. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రవాణాశాఖ రూ.4,953 కోట్లు టార్గెట్ పెట్టుకోగా.. మే నెలలో వివిధ పన్నుల సవరణతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రవాణా ఆదాయం రూ.5345 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే రవాణాశాఖ మార్చి చివరి నాటికి అనుకున్న లక్ష్యాన్ని దాటిపోనుంది. కరోనా అనంతరం 2021-22లో రవాణాశాఖ రాష్ట్రవ్యాప్తంగా రూ.3971 కోట్లు ఆదాయం ఆర్జించిన విషయం తెలిసిందే. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఆదాయ లక్ష్యం రూ.2916 కోట్లు కాగా.. ఇందులో ఇప్పటికే రూ.3వేల కోట్లకుపైగా వచ్చింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.982.98 కోట్లు, రంగారెడ్డి రూ.1150 కోట్లు, మేడ్చల్ జిల్లా రూ.900 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించినట్టు ఆర్టీఏ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో రవాణాశాఖ ముఖ్యమైనది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్ ట్యాక్స్, త్రైమాసిక పన్ను, ఫీజులు, సర్వీసు చార్జీలు, డిటెక్షన్లు, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి సమకూర్చుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది టార్గెట్ పెంచుకోవడం ఆనవాయితీ. రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు మొత్తం 54 కార్యాలయాలు ఉండగా.. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో 11 ఆఫీసులున్నాయి. వీటి పరిధిలో రోజూ 5వేలకు పైగా లావాదేవీలు జరుగుతుండగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. పన్నుల సవరణ తరువాత.. ప్రస్తుతం రూ.లక్ష లోపు విలువ చేసే ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే గతంలో రూ.9వేలు చెల్తిస్తే సరిపోయేది. ఇప్పుడు 12వేల వరకు జీవితకాల పన్ను చెల్లించాల్సి వస్తోంది. అంటే దాదాపు రూ.3వేలు అదనం. అలాగే, రూ.10లక్షల లోపు విలువ చేసే కారు కొనుగోలు చేస్తే గతంలో రూ.1.20లక్షల పన్ను రూపంలో చెల్లించేవారు. ఇప్పుడది రూ.1.40 లక్షలు వస్తుండగా.. అంటే రూ.20వేలు పెరిగింది. ఇదొక్కటే కాదు.. గ్రీన్ ట్యాక్స్ సైతం బైక్‌లకు 2వేలు, కార్లకు రూ.5వేల వరకు పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త వాహనం కొనుగోలు సమయంలో టూ వీలర్‌కు 12 శాతం, పది లక్షలు దాటిన వాహనాల కొనుగోలుపై 14 లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.26లక్షల మోటార్ సైకిళ్లు, 1.62లక్షల కార్లు, ఇతర వాహనాలు 1.11 లక్షలతో మొత్తం 7.98లక్షల వాహనాలు ఆర్టీఏలో నమోదు కాగా.. తద్వారా రూ.3,840 కోట్లు ఆదాయం సమకూరింది. అంటే 12శాతం వృద్ధి నమోదైంది. ఇక గ్రీన్‌ట్యాక్స్ ద్వారా రూ.52 కోట్లు, ఫీజుల ద్వారా రూ.458 కోట్లు, సర్వీసు చార్జీల ద్వారా 113 కోట్లు, డిటెక్షన్ల ద్వారా రూ.124కోట్లు వసూలైంది. ఇదిలావుంటే గ్రేటర్ పరిధిలో అన్నీ కలిపి రూ.3వేల కోట్ల వరకు వసూలైనట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.