Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్‌లను మరింత బలోపేతం చేయాలి
- వ్యవసాయం పద్దు చర్చలో చెన్నమనేని రమేశ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రోత్సహించడమేగాక మరింత బలోపేతం చేయాలని శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్ అభిప్రాయపడ్డారు. కరోనాకాలంలోనూ కరీంనగర్ డీసీసీబీ లాభాలబాటలో నడిచిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్, ఇతర అవసరాలను అందిస్తూ ప్రోత్సహించడం మంచి పరిణామమని అన్నారు. మహిళలు, చేతివృత్తులు, అసంఘటిత రంగాలకు సహకార రంగం సహకరిస్తుందని వివరించారు. తద్వారా ఉత్పాదకశక్తి పెరిగి సహకార సంఘాలు లాభాల్లో నడుస్తు న్నాయని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలను భాగస్వాములను చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానిం చారు. ఇటీవల దావోస్‌లోనూ ఈ రంగంపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. మాంద్యంలోనూ సహకార రంగం ముందుకుపోవడం హర్షణీయమని చెప్పారు. దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సామాజిక ఆర్థిక ప్రగతికి ఊతమిస్తుందన్నారు. సిరిసిల్లలోనూ సహకార సంస్థ వేగంగా వృద్ధిలోకి వచ్చిందని తెలియజేశారు. మరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. మన సర్కారు విధానాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. ఒకనాడు వ్యవసాయమంటే సంక్షోభమనీ, నేడది సంతోషమని వ్యాఖ్యానించారు. ఈ రంగాన్ని గట్టెక్కించడంలో సీఎం సఫలీకృతులయ్యారని చెప్పారు. నాటి ప్రభు త్వాల కాలంలో వ్యవసాయానికి రూ. 7994 కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. చెరువుల పునరు ద్ధరణ దగ్గర నుంచి ఉచిత విద్యుత్, రుణమాఫీ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఎరువులు, గోదాముల నిర్మాణం, రైతు వేదికలు, రైతుల్లో చైతన్యం నింపడం తదితర పనులు చేయడం కేసీఆర్‌తోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. రైతు బీమాతో చాలా కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్ర ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ పథకానికి నిధులు కొరత ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కారు వ్యవసాయానికి రూ.90 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ. 29 వేల కోట్లు కోత పెట్టిందని గుర్తు చేశారు.
119 సభ్యులు..సభలో 21 మంది
అసెంబ్లీలో శనివారం వ్యవసాయ పద్దుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 119 శాసనసభ్యులకుగాను కేవలం 21 మంది మాత్రమే తొలుత సభలో కనిపించడం గమనార్హం. టీ బ్రేక్ అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభలోకి ప్రవేశించినప్పుడు కేవలం 11 మంది మాత్రమే సీట్లల్లో ఉన్నారు. అనంతరం ఆ సంఖ్య 21 పెరిగింది. మరో పావు గంటకు 30కి చేరారు. మొదటి నుంచి మంత్రులు టి. హరీశ్‌రావు, పి.సబితారెడ్డి, మహమూద్ అలీ, ఎస్.నిరంజన్‌రెడ్డి తమ తమ స్థానాల్లో ఆసీనులు కాగా, మరో మంత్రి మల్లారెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మహిళా సభ్యురాలు గొంగిడి సునీత ఒక్కరే ముందు నుంచీ ఉన్నారు. అనంతరం చర్చ జరుగుతున్న క్రమంలో మంత్రి సత్యవతిరాథోడ్, బానోత్ హరిప్రియానాయక్ వచ్చారు. కొద్దిసేపటి తర్వాత మరో మహిళా సభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి వచ్చారు. ఎంఐఎం నుంచి మగ్గురు సభ్యులు మాత్రమే కనిపించారు. ఇకపోతే బీజేపీకి చెందిన ముగ్గురికిగాను ఒక్కరూ సభలో లేకపోవడం గమనార్హం. పెద్ది సుదర్భన్రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో బీజేపీ సభ్యులు సభలో ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కాంగ్రెస్ సభ్యులు డి.శ్రీధర్‌బాబు చర్చ ప్రారంభంలో ఉండి, మధ్యలో బయటకెళ్లారు. అలాగే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్దుపై చర్చను గమనించకుండా దినపత్రికలు చదువుతూ కనిపించారు. మరికొందరు పద్దు పత్రాలు సీరియేస్గా చదువుతూ, పాయింట్లను నోట్‌చేసుకోవడం మీడియా కంటపడింది. కీలకపద్దుపై చర్చ జరుగుతున్న సమయంలో అత్యధిక సభ్యులు సభలో లేకపోవడంపై మీడియా గ్యాలరీలో చర్చకు ఆస్కారమేర్పడింది.