Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్లుగా ఎండీ శ్రీధర్ డిప్యూటేషన్.. చట్ట విరుద్ధం
- తాము అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి విచారణ
- ఇల్లందు జీకే ఓసీ ఫిట్ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
బొగ్గు గనుల్లో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని, సింగరేణి ఎండీగా 8 ఏండ్లుగా శ్రీధర్ డిప్యూటేషన్‌పై కొనసాగడం చట్ట విరుద్ధమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఓసీలు రద్దు చేస్తానని, భూగర్భ గనులు తీసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో పలు సభల్లో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి రాగానే భూగర్భ గనులను మూసేసి ఓసీలు తెరుస్తూ ప్రయివేటుకు అప్పజెప్పారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జేకే ఓసీ వద్ద శనివారం ఫిట్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడారు. తొలుత ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బొగ్గు గనుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉంటూ కేసీఆర్ కుటుంబం 30 వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. 70వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య.. నేడు ప్రయివేటీకరణ, భూగర్భ గనుల మూత మూలంగా 40 వేలకు దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఓసీలను ప్రయివేటుపరం చేస్తోందని, అరబిందో సంస్థకు అప్పగించిందని అన్నారు. రూ.12వేల కోట్లు జెన్కోకు బకాయి పడ్డారని, దీంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఓసీలతో కార్మికులు ఉద్యోగాలు కోల్పో తున్నారు, పర్యావరణం ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. అల వెన్సులు లేవు, లేని నిల్వలు చూపించి యాజమాన్యం అప్పులు చేస్తోందని చెప్పా రు. సింగరేణి ఎండిగా శ్రీధర్ డిప్యూటేషన్ చట్టవిరుద్ధమన్నారు. కేసీఆర్ చెప్పినట్టు చేస్తూ.. కండ్లు మూసుకుని సంతకాలు పెడుతూ దోచిపెడుతున్నారని ఆరోపిం చారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. మరో పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలోకి వస్తుందని, అప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. భూగర్భ గనులు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్మికులను బదిలీలు చేయొద్దని, కొత్తగా ఓపెన్ చేసే పూసపల్లిలో విలీనం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ ఓటు అడగడానికి వస్తే బొగ్గు గనుల్లో బొంద పెట్టాలని చెప్పారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర నేత జనక్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేతలు ధల్ సింగ్, డాక్టర్, రామచంద్రనాయక్, పట్టణ మండల అధ్యక్షులు డానియల్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడో' యాత్ర శనివారం ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా నుంచి పట్టణంలోని జగదాంబసెంటర్ వరకు నాలుగు కిలోమీటర్లు సాగింది. ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. అనంతరం సింగరేణి కార్మికులతో కలిసి ఫిట్ మీటింగ్‌లో మాట్లాడారు. సాయంత్రం ఆరు గంటలకు జగదాంబసెంటర్‌లో బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.