Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
నవతెలంగాణ- విలేకరులు
కరెంటు లేక.. నీరందక వరి పొలాలు ఎండిపోతున్నా అధికారులు కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై శనివారం కూడా సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వారం రోజులుగా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్యుత్ అధికారుల పనితీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఏడు గంటలకన్నా ఎక్కువ రావడం లేదన్నారు. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. కరెంటు సమస్య ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, వెంటనే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లో రైతులు సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులకు కనీసం 6 నుంచి 7 గంటలు కూడా సరిగా విద్యుత్ రావడం లేదన్నారు.
వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి మండలం కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు పిడుగు తిరుపతిరెడ్డి, నాయకులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, ఇల్లెందుల రాజు, రైతులు పాల్గొన్నారు.