Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి సూచన
- పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ విధ్వంస విధానాలను ప్రజలందరికీ విడమరిచి చెప్పడం ద్వారా, వారిని చైతన్య పరచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడుతూ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చక్కగా వివరించారంటూ మంత్రిని అభినందించారు. బీజేపీ అనుసరిస్తున్న దివాళకోరు, మతోన్మాద విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సింగరేణి, ఆర్టీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను రక్షిస్తామంటూ హామీ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నర్సిరెడ్డి ఆయా శాఖలు, పలు రకాల క్యాడర్లలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కరించాలని కోరారు.
తనకు ప్రతీ రోజు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ అధ్యాపకుల నుంచి అదే పనిగా ఫోన్లు వస్తున్నాయనే విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ ప్రాతిపదికన పని చేస్తున్న సిబ్బంది వేతనాలు ఆరు నెల్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గెస్ట్ లెక్చరర్ల జీతాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అందరికీ పీఎఫ్ ఆరు నెల్లుగా పెండింగ్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ, కనీసం ఒక పీఆర్సీ అయినా ఇవ్వాలని కోరారు. పోలీసు, రెవెన్యూ శాఖల్లో పోస్టులు మంజూరు చేసి స్థిరీకరించినట్టుగానే విద్యాశాఖలో డీఈవో, ఎంఈవో, డిప్యూటీ, డీఐఇవో తదితర పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2012లో ఖమ్మం, ఏటూరు నాగారం, ఆదిలాబాద్ ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లను గిరిజన పాఠశాలలుగా మారుస్తూ మంజూరు చేసిన పోస్టులను ఇవ్వాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ఏడాదైనా పూర్తి చేయాలి
శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగ మార్గం పనులను ఈ ఏడాదైనా పూర్తి చేయాలని, అది పూర్తయితే విద్యుత్ అవసరం లేకుండా నీరు అందుబాటులోకి వస్తుందని నర్సిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ, ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు ప్రత్యామ్నాయంపై ముఖ్యమంత్రి ఆలోచించారని తెలిపారు. 44 కిలోమీటర్లలో ఇంకా 9 కిలోమీటర్లే మిగిలి ఉందని చెప్పారు. 2004లో టెండర్ ఖరారైందనీ, ధరలు పెరగడంతో ఆ కాంట్రాక్టర్ వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడితే, అదనపు నిధులు కేటాయించి తమ ప్రభుత్వం ఆపిందని చెప్పారు. ఉద్యోగులకు కరోనా సమయంలోనూ జీతాలిచ్చామని తెలిపారు.