Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మెహిదీపట్నం
భూతవైద్యం పేరుతో ఏడుగురిని పెండ్లి చేసుకున్న ఓ దొంగ బాబా 8వ పెండ్లికి సిద్ధమయ్యాడు. అయితే అతను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి పెండ్లికి రాలేదు. దాంతో వధువు బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగ బాబా గుట్టురట్టయింది. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ సీఐ శ్రీనివాస్, బాధిత యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ టోలిచౌకికి చెందిన 18 ఏండ్ల యువతి మూడేండ్లుగా ఏపీలోని నెల్లూరులో రెహ్మతాబాద్ దర్గాకు చెందిన 54 ఏండ్ల హఫీజ్ పాషా వద్ద అనారోగ్యానికి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలోనే యువతిని పెండ్లి చేసుకుంటానని బాబా నమ్మించాడు. యువతి కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడంతో టోలిచౌకి ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి 11 గంటలకు వారి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెండ్లికి బాబా రాలేదు. బాబా అనుచరులు వచ్చి బాబాకు గుండెపోటు వచ్చిందని.. పెండ్లి వాయిదా వేసుకోవాలని చెప్పారు. అయితే వధువు బంధువులు అనుమానంతో లంగర్ హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ బాబాకు ఇదివరకే ఏడు పెండ్లీండ్లు అయినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, డిశ్చార్జి అవ్వగానే అతన్ని పోలీసులు అరెస్టు చేయనున్నారని సమాచారం. కాగా, దొంగ బాబా తన కూతురును ట్రాప్ చేశాడని ఆమె తండ్రి ఆరోపించారు. తన కూతురికి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని పెండ్లి బంధంతో అది నయమవుతుందని, లేకపోతే చనిపోతుందని బాబా బెదిరించడం వల్లే ఈ పెండ్లికి ఒప్పుకున్నామని తెలిపారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.