Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి సర్వే చేస్తామన్న అధికారులను అడ్డుకుంటామంటూ..
- డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎదుట ఆందోళనలో లబ్దిదారులు
నవతెలంగాణ-జనగామ
తమ ఇండ్లు తమకే కావాలని ఇందిరమ్మ మూడో విడత లబ్దిదారులు పట్టు పట్టారు. 2013లో ఎంపిక చేసి పట్టాలు పొందిన లబ్దిదారులకు కాకుండా మరోసారి సర్వే చేసి లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు సోమవారం నిర్వహించిన గ్రామ సభలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మందికి పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎదుట ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాణాపురం ఇందిరమ్మ మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఆందోళనకు దిగారు. చీకట్లోనైనా తమ ఇండ్లలోనే ఉంటామని భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టాలిచ్చిన లబ్దిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందేనని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి వెంటనే లబ్దిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇందిరమ్మ మూడో విడత లబ్దిదారులకు ఇచ్చిన పట్టాలకు ఇండ్లు చూపించకపోవడంతో బాధితులు పలు సందర్భాల్లో అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దాంతో విసిగివేసారిన లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని చలి సైతం లెక్కచేయకుండా అక్కడే ఆందోళనకు దిగారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పట్టా ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, సుంచు విజేందర్, చందు నాయక్, పట్టణ కమిటీ సభ్యులు పందిళ్ళ కళ్యాణి, పల్లెర్ల లలిత, రజిత, కొండ వరలక్ష్మి, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.