Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టల్ పైఅంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలు
- ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- గురుకులాల్లో పట్టింపు కరువు.. భద్రత శూన్యం..
నవతెలంగాణ-గంగాధర :గురుకుల పాఠశాల విద్యార్థిని హాస్టల్ నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన హాసిని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చూడటానికి హాస్టల్కు వస్తూ వెళ్తుంటారు. హాసిని తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వల్ల ఆదివారం హాస్టల్కు రాలేకపోయారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే దిగులుతో హాస్టల్ పై అంతస్తు నుంచి దూకింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజు తెలిపారు. కాగా, విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల్సిన హాస్టల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పట్టింపులేని ధోరణితో వ్యవహరించడం వల్లే విద్యార్థిని హాస్టల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులతో స్థానికంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కరీంనగర్లో నివాసం ఉంటూ ఉదయం వస్తూ సాయంత్రం వెళ్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.