Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కూరగాయలు విక్రయించే పద్దతులు అనాగరికంగా ఉన్నాయనీ, ఈ పద్దతి వల్ల బాక్టీరియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందువల్ల, శాస్త్రీయ ధృక్పథంతో ఎంత జనాభాకు ఎన్ని మార్కెట్లు కావాలో ఆలోచించి ఆధునిక మార్కెట్ల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. ఆదివారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సమీకృత మార్కెట్లపై అధికార పార్టీ సబ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల సరుకులను ఒకే మార్కెట్లో చేర్చుతూ సమీకృత మార్కెట్లను ఎన్ని ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డిని అడిగారు. అలాగే సభ్యులు ఎల్గనమోని అంజయ్య ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో నాణ్యమైన విత్తనాలను అమ్మాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ సంస్కారవంతమైన, అధునాతనమైన పద్దతుల్లో ప్రతి నియోజక వర్గంలో ఒక మార్కెట్‌ను నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని చెప్పారు.. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవన్నారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. రెండున్నర అడుగుల ఎత్తులో కూరగాయలు పెట్టి అమ్మడం సరైందేనన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు లేవని తెలిపారు. ఇక్కడి మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈనేపథ్యంలో సమీకత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అధునాతన కూరగాయల మార్కెట్టను ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని తెలిపారు. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామనీ, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామన్నారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్టు తాను విన్నానని చెప్పారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అవసరమైతే వారిపై పీడీ యాక్టుకింద కేసులు పెట్టాలని సూచించారు.
1500 ఆశా పోస్టులను
భర్తీ చేస్తాం.. :మంత్రి హరీశ్‌రావు
జీహెచ్ఎంసీ పరిధిలో 1,500 ఆశ పోస్టులకు ఈ నెలలోపు భర్తీ చేస్తామనీ, అందుకోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అధికార పార్టీ సభ్యులు వివేకానందగౌడ్, గణేష్‌బిగాల, కోరుకంటి చందర్, జాఫర్‌హుసేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో ఉచితంగా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి పరీక్షల సంఖ్యను 134 కు పెంచుతామని అన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బస్తీ దవాఖానాలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు బస్తీదవాఖానాల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారన్నారు. పేదల సౌకర్యం కోసం వాటి పని దినాల్లో మార్పు చేస్తామన్నారు. శనివారం సెలవు ఇస్తున్నామనీ, అవి ఆదివారం కూడా పనిచేయనున్నాయని తెలిపారు.
రూప్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహకం..:మంత్రి జగదీశ్‌రెడ్డి
రూప్ టాప్ ద్వారా సౌర విద్యుత్పత్తికి ప్రభుత్వ ప్రొత్సాహకం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శాసన సభలో ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కోరుకంటి చందర్, మహేశ్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరులు సౌర, పవన, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు, వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే ప్రక్రియలో భాగంగా సోలార్ టెండర్లు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సౌర రూఫ్‌టాప్ ట్రాకింగ్, నెట్ మీటరింగ్,ి వినియోగ సౌలభ్యం మొదలైన సదుపాయాలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడింపులతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నాటికి పునరూత్పాదక ఇంధన సామర్థ్యం 6,159 మెగావాట్లు నమోదైందని ఆయన తెలిపారు. డిస్కంలకు 287 మెగావాట్ల సౌర రూఫ్ టాప్ సామర్థ్యాన్ని అందించామని తెలిపారు. జనవరి చివరినాటికి 5,748 మెగావాట్ల సౌర విద్యుత్, 128.10 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు ఆయన సభకు వివరించారు. రాబోయే రేండేండ్లలో 2,500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
పెరిగిన పచ్చదనం..:మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. 2015 నుంచి 2021 మధ్య పచ్చదనం 7.70 శాతం పెరిగినట్టు ఐఎఫ్ఎస్ఆర్ ప్రకటించిందన్నారు. పచ్చదనం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంచించిందని వివరించారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు చంటి క్రాంతి కిరణ్, మనోహర్‌రెడ్డి, అజ్వీరా రేఖానాయక్ హరితహారం, పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్దఎత్తున పనులు చేపడుతున్నామన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల లోపల, వెలుపల పెద్దఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2023-2024లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్డెశించుకున్నామని వెల్లడించారు. మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించామన్నారు. మొక్కల పెంపకం సక్రమంగా జరిగేలా చూడటానికి జియో ట్యాగింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్‌ను చేపట్టామని తెలిపారు.
కొల్లాపూర్ మామిడి గొప్పది..:
మంత్రి నిరంజన్ రెడ్డి
కొల్లాపూర్ మామిడి విషిష్టమైందీ, శ్రేష్టమైందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. అధికార పార్టీ సభ్యులు హర్షవర్దన్ రెడ్డి, దుర్గం చిన్నయ్య,మోహినుద్దీన్ శాసన సభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉమ్మడి మహాబూబ్‌నగర్, జగిత్యాల, నిర్మల్,అసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లో మామిడి బాగా పండుతున్నదని చెప్పారు. కొల్లాపూర్‌లో మామిడి పండ్ల మార్కెట్ నిర్మాణానికి మంజూరైందన్నారు. వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. పహడీషరీఫ్ పండ్ల మార్కెట్, మిగతా ప్రాంతాల్లో అవసరమైన మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.
రుణ మాఫీ చేస్తాం..
అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు పొడెం వీర య్య రైతుల రుణమాఫీకి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించలేదనీ, అలాంటప్పుడు రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ ఖచ్చితంగా రుణ మాఫీ చేస్తామని హామీనిచ్చారు. దీనిపై ఇప్పటికే సమాధానమిచ్చానని తెలిపారు.
కోతుల బెడద..
రాష్ట్రంలో కోతుల బెడదను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. కోతుల సంతానోత్పత్తిని తగ్గించేందుకు ఫారెస్టు, వ్యవసాయ శాఖలతో కమిటీ వేశామని చెప్పారు.కంట్రోల్ కేంద్రాలను ప్రతి నియోజక వర్గాలకు విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.
అక్షరాస్యత రేటు
పెంచేందుకు కృషి..:మంత్రి సబితా
రాష్ట్రంలో అక్షరాస్యతా రేటును పెంచేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ సబ్యులు మెతుకు ఆనంద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 66.54శాతంగా ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరసగా 60- 40 శాతం వాటాతో నూతన అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో అక్షరాస్యత రేటును మరింత సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈచ్‌వన్ టీచ్‌వన్, కమ్యూనిటీల ఇన్వాల్‌మెంట్‌తో ఈ పని పూర్తిచేయాలనుకున్నామన్నారు.
సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నాం..:మంత్రి సబితా
ఆశ్రమ పాఠశాలల సంఖ్యను రాష్ట్రం ఏర్పడిన తర్వాత 709కి పెంచామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు గాదరి కిషోర్, నోముల భరత్, హరిప్రియ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పుడు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 3,92,586కు పెరిగిందన్నారు. గురుకులాలకు పెద్దపీట వేయటమేగాక, చాలా పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశామన్నారు. వాటిలో ఫలితాలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయని చెప్పారు. అత్యున్నతమైన కళాశాలల్లో సీట్లు సంపాదిస్తున్నారన్నారు. సొంత భవనాల నిర్మాణంతో పాటు అద్దెలు ఆలస్యం కాకుండా చూస్తామని హామినిచ్చారు.
రాష్ట్రంలో 136 అగ్నిమాపక కేంద్రాలు..:మంత్రి మహుముద్‌అలీ
రాష్ట్రంలో 136 అగ్నిమాపక కేంద్రాలున్నాయని మంత్రి మహుముద్‌అలీ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యుడు బాపూరావు రాథోడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..బోథ్మండల కేంద్రంలో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు.