Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు విధానాలను తూర్పారబట్టిన సీఎం కేసీఆర్, మంత్రులు
- 'ఉపాధి', 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల విషయంలో అన్యాయంపై ప్రస్తావన
- నెలాఖరుకల్లా పోడుభూముల పట్టాల పంపిణీకి సీఎం గ్రీన్‌సిగల్
- పలు తెగలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏడ్రోజుల్లోనే ముగిశాయి. శాసనసభ, శాసనమండలి నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 3న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. నాలుగో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. ఐదో తేదీన సభ నడవలేదు. ఆరోతేదీన శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏడో తేదీన సభకు సెలవు ప్రకటించారు. 8 నుంచి 12వ తేదీ వరకు పలు బిల్లులపైనా, తీర్మానాలపైనా చర్చ సాగింది. ఈ నెలాఖరు వరకు పోడుభూముల పట్టాలను అందజేస్తాంటూ సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. వాల్మీకిబోయ, బేదర్, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖయాతి లంబాడ, భాట్ మధురాలు, చమర్ మధురాలు తెగలను కేంద్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఉభయ సభలు మరోసారి తీర్మానం చేశాయి. మొత్తం ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు. మొత్తంగా అసెంబ్లీలో సీఎం, మంత్రులు కలిసి 30.43 గంటలు, బీఆర్ఎస్ సభ్యులు 11.05 గంటలు, ఎంఐఎం సభ్యులు 6.04 గంటలు, కాంగ్రెస్ 5. 46 గంటలు, బీజేపీ సభ్యులు 2.33 గంటలు, ఏఐఎఫ్బీ సభ్యులు 12 నిమిషాలు, ఇండిపెండెంట్ సభ్యులు 02 నిమిషాలు మాట్లాడారు. మండలి కార్యకలాపాలు ఐదు రోజుల పాటు 17 గంటలు కొనసాగాయి. అక్కడ సీఎం, మంత్రులు 7.42 గంటలు, బీఆర్ఎస్ సభ్యులు 5.33 గంటలు, కాంగ్రెస్ సభ్యులు గంటా పది నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 38 నిమిషాలు, పీఆర్టీయూ సభ్యులు 51 నిమిషాలు, ఇండిపెండెంట్లు గంటా ఆరు నిమిషాలు మాట్లాడారు.
మీమాంస నడుమ గవర్నర్ ప్రసంగం
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా? ఉంటే రాష్ట్ర సర్కారు ఇచ్చిన ప్రసంగాన్ని ఆమె అదే రకంగా చదువుతారా? లేదా? ప్రసంగం కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తారు? తమిళనాడు తరహాలో ఏమైనా చదవకుండా వదిలేస్తారా? అనే మీమాంస సమావేశాలకు ముందు నెలకొంది. అంతిమంగా రాజ్‌భవన్, రాష్ట్ర సర్కారు రాజీతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం సాఫీగా కొనసాగింది. రాష్ట్ర సర్కారు ఇచ్చిన ప్రసంగం కాపీని ఆమె అదేరీతిన చదివి వినిపించారు. అదే సమయంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుందో ఏమోగానీ రాష్ట్ర సర్కారు కూడా ఆ కాపీలో కేంద్రంపై పల్లెత్తు మాట కూడా లేకుండా జాగ్రత్త పడింది. అసలు కేంద్రం ప్రస్తావనే లేకుండా గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
ధన్యవాద తీర్మానం నుంచే కేంద్రంపై ఎటాక్
నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ప్రధానంగా ఎండగట్టడంలో రాష్ట్ర సర్కారు విజయవంతం అయింది. దేశం కోసం..ధర్మం కోసం అంటూ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును కేటీఆర్ ఎండగడుతూనే దేశమంటే ఆదానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కాదు..140 కోట్ల ప్రజలని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నడూ లేనంత స్థాయిలో బీజేపీపై ఘాటైన పదజాలంతో అటు శాసనసభలోనూ, ఇటు మండలిలోనూ సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ సభ్యులు దాడికి దిగారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఏవిధంగా అడ్డుపడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు, కూలీలకు వెన్నుదన్నుగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న క్రమాన్ని ఎర్రబెల్లి ఎండగట్టారు. రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ నిధుల విషయంలో కొర్రీలు పెట్టి అడ్డుకుంటున్న కేంద్రం వైఖరిని తప్పుబట్టారు.
సభ నడిచింది ఇలా..
మొత్తంగా ఏడురోజుల్లో 56.25 గంటలపాటు సభ నడిచింది. అందులో దాదాపు 39 గంటల సభ కేవలం మూడ్రోజుల్లోనే (గురు, శుక్ర, శనివారాల్లో) జరగడం గమనార్హం. శుక్రవారం సభలో మల్లారెడ్డి మాట్లాడే సమయంలో నవ్వుల పువ్వులుపూయించారు. మంత్రి కేటీఆర్‌తో సహా సభ్యులందర్నీ ఆయన నవ్వించారు. శనివారం రాత్రి 11: 50 గంటల వరకు సుధీర్ఘంగా పద్దులపై చర్చ నడిచింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడేందుకు లేచిన సమయంలో కొందరు సభ్యులు 'సార్ ప్లీజ్..రాత్రయింది. 15 నిమిషాల్లో పూర్తిచేయండి' అంటూ సభలో విజ్ఞప్తి చేయటం కనిపించింది. అయినా, ఆయన గంటకుపైగా మాట్లాడారు. ఆ తర్వాత మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడేందుకు లేవగా..సభలోని సభ్యులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. 'బంద్ పెట్టమంటున్నారా? దండం పెడతా ఆపండి. మాట్లాడనీయండి' అంటూ ఎర్రబెల్లి అనటంతో స్పీకర్ పోచారం జోక్యం చేసుకుంటూ 'నీవు అట్లెందుకు అనుకుంటున్నవ్? పొగుడుతున్నా రయ్యా..నీవు కంటిన్యూ చేరు'...'నీవు భట్టివైపు చూడ కు..నావైపు చూస్తూ మాట్లాడు' అనటంతో సభ్యులంతా ఘొల్లుమన్నారు. సభ్యులంతా ఎవరికివారు ముచ్చట్లు పెట్టు కుంటుండగా..నిరంజన్‌రెడ్డి 'ఏకాగ్రతతో చర్చలో పాల్గొ నండి' అనటం కనిపించింది. మొత్తంగా రెండు రోజు ల(గురు, శుక్రవారాలు) పాటు రాత్రి 11 గంటల దాకా, శని వారం 12 గంటల దాకా సభ కొనసాగినప్పటికీ అంత సీరి యస్‌నెస్ కనిపించలేదు. సభ్యుల సంఖ్య 30 లోపే కనిపిం చింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డినే స్వయంగా లేచి మాట్లా డుతూ..'అధ్యక్షా? చూడండి. సభలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడు కూడా లేడు. ప్రశ్నలు అడుగుతరు. పోతరు. మంత్రులు చెప్పే సమాధానాలను కనీసం వినరు. ప్రజా సమస్యలపై వారికున్న చిత్తశుద్ధి ఇదీ..' అని విమర్శించారు. అలా అన్నారో..లేదో పరుగున అందుబాటులో ఉన్న ఎంఐఎం సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు సభకు వచ్చేశారు. 'రాత్రి 12 గంటల దాకా సమావేశాలేంటి? అర్ధవంతంగా చర్చ జరగాలంటే ఇదే సమయాన్ని రెండు మూడు రోజులు పొడిగించి జరుపుకుంటే సరిపోయేది' అని కొందరు సభ్యులు గునుక్కోవడం కూడా కనిపించింది.