Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
- అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
మద్నూర్ మార్కెట్ యార్డులో అవినీతి జరిగిందని సాక్షాధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేయడంతో తనను మానసికంగా వేదిస్తున్నారని, బెదిరింపులు, దాడులు పెరిగాయని.. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి కలెక్టరేట్ వద్ద సోమవారం కలకలం రేపింది. ఎస్ఐ అప్రమత్తతతో యువకుడు ప్రాణం నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే యువకుడు రెండేండ్ల కిందట మద్నూర్ మార్కెట్ యార్డులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆర్టీఐ ద్వారా మార్కెట్ కమిటీకి వచ్చే నిధులు, ఖర్చుల వివరాలు కోరారు. అయితే యార్డు అధికారులు సమాచారం ఇవ్వలేదు. దాంతో తనవద్ద ఉన్న ఆధారాలతో ఢిల్లీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్ల అవినీతి జరిగిందని తగిన సాక్షాధారాలతో కలెక్టర్ కార్యాలయంలో, వ్యవసాయ శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన రాలేదు. అధికారుల చుట్టూ తిరగడంతో పాటు సిద్ధప్ప వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. బెదిరింపులకు పాల్పడటం కూడా మొదలు పెట్టారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆధారాలు లాక్కునే ప్రయత్నం చేసారని సిద్ధప్ప ఆరోపించారు. మార్కెట్ యార్డులో 5 కోట్ల వరకు అవినీతి జరిగిందని, విచారణకు అదేశించి అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు అధికార పార్టీ మండల నాయకులు తన అనుచరులకు మద్యం తాగించి తనను కొట్టించాడని ఆరోపించారు. దాంతో 7 నెలలుగా తాను ఇంటికి వెళ్లడం లేదని, నిజామాబాద్లో ఉంటున్నానని తెలిపారు. అవినీతిపై ప్రశ్నించినందుకు తన కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను ఇంటికి వెళ్తే ప్రాణహాని ఉందని చెప్పారు. తన కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ఫిర్యాదు చేస్తే న్యాయం జరగకపోగా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని దీనంగా ప్రాధేయపడ్డాడు. అధికారులు ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.