Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-ఉట్నూర్
రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులను సీఎం కేసీఆర్ దురాక్రమణదారులు అనడం సిగ్గుచేటని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఉట్నూర్‌కు వచ్చారు. ఐటీడీఏ నుంచి తహసీల్దార్ కార్యా లయం, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైం దన్నారు. అందుకు నిదర్శనమే ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయమని చెప్పారు. ఎన్నో దశాబ్దాల కాలంలో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే నోరు కూడా మెదపడం లేదన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు, గిరిజనులు పడుతున్న బాధలను చూశానన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల చుట్టుపక్కల ఉన్న వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడానికే ధరణి అన్నారు. ధరణి వల్ల సాగుదారులు ఇబ్బందులు పడుతున్నా, సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చూస్తుంటే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందన్నారు. కేవలం అంకెల గారడిని ప్రవేశపెట్టారన్నారు. ఏజెన్సీలో పోడుభూములు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వకుండా సాగుదారులను దురాక్రమణదారులుగా పోల్చడం సరైంది కాదన్నారు. వెంటనే కేసీఆర్ ఆదివాసీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై దాడులు, దౌర్జన్యం చేసి జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.